హజారీ – సార్థక నామధేయుడు

హజారీ అనే పేరు గల ఒక రైతు ఉండేవాడు. ఆయన తన పొలం గట్లపై మామిడి మొక్కలను నాటాడు. ఆయన ఎంతో శ్రమపడి వాటికి ఎరువు, నీరు అందించి పశువుల నుండి రక్షణ కల్పించాడు. కొన్ని సంవత్సరాలకు మామిడి చెట్లు ఏపుగా పెరిగాయి. పశు పక్ష్యాదులు చెట్లనీడలో కూర్చోవడం మొదలు పెట్టాయి. కొన్ని పక్షులు గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. పక్షుల కిలకిలరావాలు అందరికి నచ్చాయి. వేసవి కాలంలో చెట్ల నీడలో మంచం వేసుకొని విశ్రాంతి తీసుకోవడం ద్వారా హజారీ ఎంతో ఆనందం పొందేవాడు. మామిడి చెట్లపై పూత వచ్చినప్పుడు కోయిల కుహు కుహు రాగాలతో చుట్టూ ఉండే వాతావరణం మరింత ఆహ్లాదకరమయ్యేది. హజారీకి తను చేసిన పని వల్ల సంతృప్తి కలిగింది. అంతేగాక చుట్టుప్రక్కల ఉన్న రైతులు పొలాల గట్లపై కూడా ఇదే విధంగా మామిడిచెట్లను పెంచితే ఆ ఊరంతా పచ్చదనంతో, మంచి వాతావరణంలో అలరారుతుందని అనిపించింది. ఇంకేముంది! ఆ పనిలో ఆయన నిమగ్నమయ్యాడు.
ఆయన తన పొలంలో మామిడి మొక్కలను పెంచే నర్సరీని ఏర్పాటు చేసాడు. గ్రామగ్రామాన తిరిగి మామిడి మొక్కలను నాటడానికి రైతులకు ప్రేరణనిచ్చాడు. స్వయంగా తానే రైతుల పొలాల గట్లపై మామిడి మొక్కలను నాటడం ప్రారంభించాడు. వాటికి సంబంధించిన వ్యవస్థ కూడా తయారు చేసాడు.
కొన్ని సంవత్సరములు గడిచేటప్పటికి హజారీ ఆలోచన, ప్రయత్నాలకు ఫలితం కనిపించింది. ప్రజల ప్రవృత్తి, హజారీ ఉత్సాహం నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా హజారీ తన జీవితకాలంలో మొత్తం ఆ ప్రాంతమంతా వేయికి పైగా తోటలను రూపొందించి తన పేరును సార్థకం చేసుకొన్నాడు. ఈ కారణంగానే ఆ ప్రాంతం “హజారీబాగ్” అనే పేరుతో పిలువబడింది. ఈ ప్రదేశం జార్ఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లా అయ్యింది.





హజార్ అనగా వేయి అని అర్థము. అతనివల్ల వేయికి పైగా తోటలు వెలిసినందుకే అతడు సార్థకనామధేయుడు.
రత్నశిఖామణి
నవంబరు 20, 2011