Archive for జూలై, 2009

జీవితం చాలా అందమైనది

Posted on జూలై 31, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యాను.ఆ సమయంలో నాకు ‘జీవితం చాలా అందమైనది’ అని అన్పించింది.

అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల  సమ్మేలనం:
ప్రాణంవెలకట్టలేనిది
భాందవ్యాలుమనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….

ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.

“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా   అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.

ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ‌ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 8 వ్యాఖ్యలు )

కృషి చేస్తే….. ఏమిటట????

Posted on జూలై 29, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

కృషి

“కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు…” ఇది ఎన్.టి.ఆర్ గారి ఒకానొక సినిమాలోని పాట యొక్క మొదటి చరణము.

ఈ రోజు  యదావిధిగా, java క్లాసు పూర్తయిన తర్వాత వేలూరు నుండి చిత్తూరుకు RTC బస్సులో తిరిగివస్తుండగా, conductor దగ్గర టికెట్ల వివరములు కలిగిన ఒక చిట్టాలో నాకు ఒక వాక్యము కనిపించింది. అదేమనగా “కృషి చేస్తే జీతమునకు, జీవితమునకు చేయూత”.

నిజమే!! కృషి చేస్తే పైన తెలపబడిన లాభాలు తప్పక కలుగుతాయి. కాని, నా ఆలోచనలు ఇంతటితో ఆగలేదు. నాకు మా పాఠశాల అధ్యాపకులు గుర్తుకు వచ్చారు. వారు నాకు చిన్ననాటి నుంచి చాలా విషయములు భోదించారు, నడత నేర్పారు, నా గుణమును స్వభావమును తీర్చిదిద్దారు, మంచి విలువలను అందించారు…… ఇంకా మరెన్నో.

పాఠశాలలో చదువుతున్న రోజులలో నాకు చిరకాలము గుర్తుకు ఉండిపోయో ఒక సంఘటన చోటుచేసుకుంది. అది నేను తొమ్మిదవ తరగతిలో, కోడైకనాలుకు విహారయాత్రకు వెళ్ళిన రోజులు. విహారయాత్ర రెండవ రోజున మా బృందము మధ్యాహ్నం భోజనానికి ఒక మాంసాహార హోటలులో దిగాము. నేను శాఖాహారి అయినందున నాకు అక్కడ భోజనం చేయటం కష్టతరమైంది. ఒక్క ముద్ద కూడా గొంతు దిగడంలేదు. నాకు తెలవకుండానే వేడివేడిగా కన్నీటి దారలు కారడం మొదలైంది. నాకు ఏమి చేయాలో పాలుపోక బయటకు వెళ్ళిపోయాను. నా తోటి విద్యార్థులంతా భోంచేసి మా యాత్ర బస్సులోనికి  ఎక్కిన తర్వాత, నేను భోజనం చేయలేదని గ్రహించిన మా social మేడము నన్ను హోటలు లోనికి బలవంతంగా తీసుకెళ్లింది. నేను చిన్నపటి నుంచి బయపడే science మేడము, ఇంకా chemistry మేడము నా ప్రక్కన కూర్చొని “మేము కూడా ప్రస్తుతము వ్రతములో ఉన్నాము. మేము కూడా మాంసాహారము తినరాదు. బాధపడవద్దు” అని నన్ను ఓదారుస్తూ, అమ్మలాగా  గోరుముద్దలు తినిపించారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే… వారు ఆనాడు కేవలం జీతం కోసమే పని చేసేవారై వుంటే నాతో ఆ విధంగా ప్రేమగా వ్యవహరించేవారా??!! ఒకవేళ, వారు జీతం కోసమే పనిచేస్తుండవచ్చు, కాని వారు వారి వృత్తిని ప్రేమించారు. వారు నాపై చూపిన వాత్సల్యము వారి జీతమునకు ఏ విధంగా దోహదపడిందో నాకు తెలియదు, కాని వారికి చిరకాలము కృతజ్ఞతా భావము కలిగిన ఒక విద్యార్థి(బిడ్ద)ను సంపాదించి పెట్టింది.

కొన్ని నెలలలో నేను కూడా ఒక సాఫ్టువేరు కంపెనీలో ఉద్యోగంలో చేరనున్నాను. నేను కూడా మా టీచర్ల వలే నా వృత్తి ప్రేమిస్తాను. బాగా కృషిచేసి నా జీతమునకు, జీవితమునకు చేయూత అందేవిధంగా నడచుకుంటాను. మరి, ఈ‌ వాక్యము చదినప్పుడు మీకు ఏమి స్పురించింది?????

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

స్వామి సన్నధిలో

Posted on జూలై 21, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |

మా నాన్నగారు తన ఇంటర్(C.E.C), శ్రీ సత్య సాయి హైయర్ సెకెండరీ స్కూలు, వైట్ ఫీల్డు, బెంగళూరులో చదివారు. స్వామి సన్నధిలో చదవడం నిజంగా పెద్ద అదృష్టం. నా తమ్ముడు అదేవిధంగా స్వామి కాలేజిలో ఇంటర్(M.P.C)కంప్యూటర్స్  , పుట్టపర్తిలో చదివాడు. ఇప్పుడు అక్కడ శ్రీ సత్యసాయి యూనివర్సిటిలో‌  B.Sc(M.E.S)Honsలో చేరాడు.

నేను మొదటి తరగతి ముందు ఒకసారి మరియు పదవ తరగతి తర్వాత, రెండు సార్లు అక్కడ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. నాకు అక్కడ స్వామి సన్నధిలో చదివే భాగ్యం కలగలేదు. కాని, నేను ఎందుకు బాధపడాలి? నా తరుపున, నా తమ్ముడు అక్కడ ఉన్నాడు కదా!!

నా తమ్ముడికి మంచి చదువు మాత్రమే కాకుండా రోజు తప్పనిసరి ఆటలు కూడా ఉంటుంది. ఇంకా ఆహారం చాలా బాగుంటుంది. అక్కడ చదువుల గుడి, క్రమశిక్షణకు పెట్టినపేరు. ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే ఆ నడిచే భగవానుని స్పర్షణ, దర్శన, సంభాషణ భాగ్యం దొరకడం మరో ఎత్తు.

మా తమ్ముడు ఇంటర్ హాస్టల్‌లో తీసుకొన్న కొన్ని వీడియో చిత్రాలను నాకు ఇచ్చాడు. వాటిలో  కొన్నింటిని తీసుకొని ఒక చిన్న వీడియోగా తయారుచేసాను. దాన్ని youtubeలో upload చేసాను. ఆ లంకెను క్రింద ఉంచుతున్నాను.

ఫేస్ బుక్‌లో ఉన్నవారు ఇక్కడ చూడండి.

youtubeలో చూడదలచినవారు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

భూమి – హాం ఫట్ స్వాహా

Posted on జూలై 20, 2009. Filed under: లోక జ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , |

భూమి అంతం కానుందా? ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఏదో‌ గ్రహ సకలం మన భూమిని గుద్దేస్తుందని …. శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి ఈ‌ భూమిని భస్మీపటనం చేస్తేస్తారని….. ఇటువంటి ఉత్తుత్తి కథలు చాలా వెలువడ్డాయి.

కాని, ఈ‌ మధ్య భూమికి ఓ పెద్ద విపత్తు పొంచి వున్నదని చాలా గట్టి వాదనలే వినిపిస్తున్నాయి. ప్రపంచం 21/12/2012 తేదిన అంతం కానుందని తెలిపేదే  డూమ్స్   డే (DOOMS DAY) అంటారు. అంటే, భూమి యొక్క అంతం అని అర్థం. ఈ పరిణామం చోటుచేసుకుంటుందని చెప్పే పలు వాదనలు:
౧. మాయాన్  కాలెండర్
౨. చైనీయుల “ఐ చింగ్ ” జాతక గ్రంథము
౩. “వెబ్-బాట్”‌ ప్రాజెక్టు
ఇంకా మరెన్నో……

స్వతహాగా, నాకు దీనిపై ఎటువంటి నమ్మకం లేదు. కాని, నా బ్లాగు లక్ష్యము ‘జ్ఞాన సముపార్జన’ కనుక, ఈ టపా రాస్తున్నాను. ఈ విషయం గురించి మరింత వివరణ కొరకు నా బ్లాగులోని ఈ‌ పేజీని చూడండి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

మౌనం

Posted on జూలై 19, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , |

ఇన్నాళ్లు నేను బయటి ప్రపంచం నుంచి నేర్చుకుని పాటించిన విషయాలను మాత్రమే నా బ్లాగులో ప్రస్తావించాను. కాని, ఈ రోజు నేను మా ఇంటిలో జరిగిన ఒక సంఘటన ద్వారా, నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను.

“ఒక పాపి, మరొక పాపిని ప్రేమించగలడు. అందులో గోప్పేమిలేదు. కాని, నీకు కీడు తలపెట్టిన నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు” అని ఏసు ప్రభువు చెప్పాడు. ఇదే విషయాన్ని పలు విధములగా పలు మతాలు, మహా గ్రంథాలు శెలవిస్తున్నాయి. అసలు ప్రేమించడం అంటే ఏమిటి? తప్పు చేస్తే మన్నించడం, ఆ తప్పును సరిదిద్దడం, అర్థంచేసుకోవడం, ఆపదలో ఆదుకోవడం, కష్టాల్లో తోడు నిలవడం, ఆదరించడం, ఏదైనా మంచి/గొప్ప పని చేస్తే మెచ్చుకోవడం, సన్మార్గంలో  నడుచుకునేటట్టు చూసుకోవడం  …. ఇదే ప్రేమంటే. మన శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పుకొచ్చాము కదా!! నిజంగా మనము మన శత్రువులను ప్రేమించకపోయిన, మన ఆప్తులను సరిగ్గా ప్రేమిస్తున్నామా? అసలు మన ఇంట్లోని వారితో, మన మిత్రులతో, మన శ్రేయోభిలాషులతో ఎలా మెలగుతున్నాము? ఈ రోజు, ఒక చిన్ని సంఘటన నాకు నేనే ఈ ప్రశ్నలను సంధించుకుని, వాటి పరిష్కారం వైపు ఆలోచించే విధంగా చేసింది.

ప్రేమకు బద్ద శత్రువు అహం. ‘నేను’, ‘కేవలం నేను మాత్రమే ‘ అన్న భావనే ‘అహం’. మనము తప్పు చేసినా దానిని ఎదుటివారిపై మోపడం, కోపగించుకోవడం, అసూయ చెందడం మొదలైనవి ‘అహం’ అనే భావన వలన కలుగుతున్నది. అహం కలిగిన వ్యక్తి, మదము పట్టిన గజము వంటివాడు. ఇలా ఉన్నప్పుడు, ప్రేమించడానికి ఆస్కారం ఎక్కడ? అహాన్ని ఎలా తొలగించుకోవాలో చెప్పేంత జ్ఞానం నాకు ఇంకా అబ్బలేదని నా భావన. కాని, ఏదైనా సమస్య ఎదురైతే, అది మీ ‘భాందవ్యాలను’ దెబ్బతీసేవిధంగా ఉన్నపుడు, నా దగ్గర ఒక పరిష్కరం ఉన్నది. అ పరిష్కారం  – మౌనం.

అవును మీరు సరిగ్గానే చదివారు. నేను ఈ‌ రోజు ఒక పని చేస్తున్నపుడు ఒక తప్పు చేసాను. నా అమ్మ, అప్పుడు నా తప్పును ప్రస్తావించి, నేను ఆ విధముగా చేసివుండకూడదు అని చెప్పినప్పుడు, నాకు చెడ్డ కోపం వచ్చి, చాలా పెద్దగా మా అమ్మపైపు “‌ అంతా నీ తప్పే. నీ వళ్లే నేను ఇలా చేయవలసి వచ్చింది” అని కసిరాను. మా అమ్మను బాధపెట్టాను. ఆ తర్వాత కాసేపు, మౌనంగా కూర్చున్నాను. నాకప్పుడు నేను చేసిన తప్పు తెలిసింది. మా అమ్మను ‘క్షమాపణ’ అడిగాను. ‘ఒక తప్పును మొదటి సారి చేసినప్పుడు అది నిజంగా తప్పు కాదు. కాని, దానిని మరోమారు చేస్తేనే అది నిజముగా తప్పు‘. అందుకే మా అమ్మతో మరోమారు ఈ తప్పు చేయనని చెప్పాను.

నాకు ఇంత విజ్ఞత ఎక్కడిది? మౌనంగా నేను ఉన్న కాస్త సమయము, నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అందులో నన్ను నేను సమర్థించుకునే విధముగానే ఎక్కవగా వచ్చాయి. కాని, నా అహాన్ని పక్కకు పెట్టి, అన్నీ కోణాలలో ఆ సమస్యను నేను చూడసాగాను. ఇలా ఆలోచించడం వలనే ఆ సమస్య పరిష్కరించబడింది. ఇంకా చెప్పాలంటే, నేను భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలను చేసే ఆస్కారమే లేదు. ఒకవేళ నిజంగానే ఎదుటివారు తప్పు చేసినప్పుడు, వారికి సున్నితముగా వారి తప్పును తెలియపరచి క్షమించాలి. అప్పుడే మనము నిజముగా వారిని ప్రేమించు వారవుతాము.

మనకు కోపం వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్యలో కూరుకుపోయినప్పుడు, తొందరపడి నిర్ణయాలకు రాకుండా, కాస్త మౌనం పాటించి ఆలోచన సల్పితే, మన అంతరాత్మ మనకు తప్పక పరిష్కారాన్ని చూపుతుంది. నేను స్వయంగా ఈ రోజు దీనిని అనుభవించాను. ఇది కచ్చితముగా అందరికీ పని చేస్తుందని నా ప్రగాఢ నమ్మకం. మౌనం – నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది, మా తల్లి-కొడుకుల బంధంలో కాసింత ఎడబాటైనా రాకుండా కాపాడింది . నా దృష్టిని, నా లోకానంతా ‘ప్రేమ’మయం చేసింది. రండి, అంతా కలసి ఈ ప్రపంచాన్ని ‘ప్రేమ’మయం చేస్తాము.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

హజారీ – సార్థక నామధేయుడు

Posted on జూలై 18, 2009. Filed under: ఎందరో మహానుభావులు | ట్యాగులు:, , , , , , , , , , , |

హజారీబాగ్

హజారీ అనే పేరు గల ఒక రైతు ఉండేవాడు. ఆయన తన పొలం గట్లపై మామిడి మొక్కలను నాటాడు. ఆయన ఎంతో శ్రమపడి వాటికి ఎరువు, నీరు అందించి పశువుల నుండి రక్షణ కల్పించాడు. కొన్ని సంవత్సరాలకు మామిడి చెట్లు ఏపుగా పెరిగాయి. పశు పక్ష్యాదులు చెట్లనీడలో కూర్చోవడం మొదలు పెట్టాయి. కొన్ని పక్షులు గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. పక్షుల కిలకిలరావాలు అందరికి నచ్చాయి. వేసవి కాలంలో చెట్ల నీడలో మంచం వేసుకొని విశ్రాంతి తీసుకోవడం ద్వారా హజారీ ఎంతో ఆనందం పొందేవాడు. మామిడి చెట్లపై పూత వచ్చినప్పుడు కోయిల కుహు కుహు రాగాలతో చుట్టూ ఉండే వాతావరణం మరింత ఆహ్లాదకరమయ్యేది. హజారీకి తను చేసిన పని వల్ల సంతృప్తి కలిగింది. అంతేగాక చుట్టుప్రక్కల ఉన్న రైతులు పొలాల గట్లపై కూడా ఇదే విధంగా మామిడిచెట్లను పెంచితే ఆ ఊరంతా పచ్చదనంతో, మంచి వాతావరణంలో అలరారుతుందని అనిపించింది. ఇంకేముంది! ఆ పనిలో ఆయన నిమగ్నమయ్యాడు.

ఆయన తన పొలంలో మామిడి మొక్కలను పెంచే నర్సరీని ఏర్పాటు చేసాడు. గ్రామగ్రామాన తిరిగి మామిడి మొక్కలను నాటడానికి రైతులకు ప్రేరణనిచ్చాడు. స్వయంగా తానే రైతుల పొలాల గట్లపై మామిడి మొక్కలను నాటడం ప్రారంభించాడు. వాటికి సంబంధించిన వ్యవస్థ కూడా తయారు చేసాడు.

కొన్ని సంవత్సరములు గడిచేటప్పటికి హజారీ ఆలోచన, ప్రయత్నాలకు ఫలితం కనిపించింది. ప్రజల ప్రవృత్తి, హజారీ ఉత్సాహం నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా హజారీ తన జీవితకాలంలో మొత్తం ఆ ప్రాంతమంతా వేయికి పైగా తోటలను రూపొందించి తన పేరును సార్థకం చేసుకొన్నాడు. ఈ కారణంగానే ఆ ప్రాంతం “హజారీబాగ్” అనే పేరుతో పిలువబడింది. ఈ ప్రదేశం జార్ఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లా అయ్యింది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

నిన్ను నీవు తెలుసుకో!

Posted on జూలై 17, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , |

ఈనాడు లోకములో ‘నాకన్నీ తెలుసున’ని విఱ్ఱవీగే  వెఱ్ఱివ్యక్తులు ఎందరో ఉన్నారు. కాని, వారిలో ఒక్కరైనా ఆనందమునకు నోచుకోలేకపోతున్నారు. అన్నీ తెలిసిన వారైతే ఆనందమునకు ఎందుకు దూరము కావలెను? పరమానందయ్య  శిష్యులలో ఎన్నిసార్లు లెక్కించినా ఒక్కడు తక్కువగా ఉన్నాడనే కథను మనము వినే ఉంటాము. ఆ‌ఒకడు ఎవడంటే తనను తాను మరచినవాడే. మానవుడు తన నిజతత్త్వమును తాను గుర్తించక అన్నీ తెలుసుకొన్నవాడుగా తయారైతే ఫలితము లేదు. మొదట తనను తాను గుర్తించుకొనే ప్రయత్నము పూనుకోవలెను. దీనికే ఆధ్యాత్మిక మార్గమని పేరు. దేనిని మరచి పోవలెనో దానిని మరచినప్పుడే ఆనందము ప్రాప్తిస్తుంది. అంతవరకు ఈ ప్రకృతిలో ఎన్ని రకముల కర్తవ్య కర్మల నాచరించిననూ ఆనందము ప్రాప్తించదు. మనము మరచిపోవలసినదేమిటి? చేరవలసిననది దేనిని? ‘అసతో మా సద్గమయ’, ‘తమసో మా జ్యోతిర్గమయ’, ‘మృత్యోర్మా అమృతంగమయ’ అని ప్రాచీన ఋషులు ప్రార్థించినారు. ‘అసత్తు’ అయిన జగత్తును మరచిపోవలెను. ‘తమస్సు’ అయిన అహంభావమును వదలవలెను. బ్రహ్మతత్త్వమైన అమృతత్వమును చేరవలెను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 10 వ్యాఖ్యలు )

ఓయ్! ఓయ్!

Posted on జూలై 16, 2009. Filed under: సంగీతం | ట్యాగులు:, , , , , , , , , |

his FIRST LOVE called him "ఓయ్"

his FIRST LOVE called him "ఓయ్"

His FIRST LOVE called him “ఓయ్”. సాధారణంగా నన్ను ఏ అమాయి “ఓయ్” అని పిలవలేదు. ఇంజనీరింగ్‌లో మా సీనియర్‌లు మాత్రమే నన్ను “ఓయ్! ఇక్కడకు రా. ఓయ్! ఈ పని చెయ్యరా” అని “ఓయ్” పదం వాడి పిలిచేవారు. సిద్ధార్థ, షామిలి జంటగా నటించిన “ఓయ్” విదుదలయ్యాక, నాకు ఇవి గుర్తుకువచ్చాయి.

“ఓయ్” చిత్రం బాగుందా,లేదా నాకు తెలియదు. కాని, పాటలు మాత్రం విన్నాను. చాలా బాగా నచ్చింది. ‘శ్రేయా ఘోషల్’ గాత్రం అందించిన “అనుకోలేదేనాడు”పాట అలరించింది. ముఖ్యంగా కథానాయకుడు సిద్ధార్థ పాడిన “ఓయ్! ఓయ్!” నన్ను కట్టిపడేసింది. తెలుగు-ఆంగ్ల పదాలను కలగలపి కలిగిన సాహిత్యం, మంచి సంగీతం, దానికి తోడు అదనపు ఆకర్షణగా నిలిచిన సిద్ధార్థ గొంతు నన్ను ఆ పాటవైపు చాలా ఆకర్షితుడిని చేసాయి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

జిహ్వా బహుపరాక్!!!

Posted on జూలై 15, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , |

ఓ నాలుకా! తిండి తినే విషయంలో, తిన్నగా మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండు. తిండి ఎక్కువగా తిన్నా, మాటలు ఎక్కువగా మాట్లాడినా ప్రాణహాని కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకో!

పంచేంద్రియాల్లో నాలుక ప్రధానమైనది. భాషకు పర్యాయపదంగా నాలుక ప్రయోగించబడుతుంది.’వాడు నోట్లో నాలుక లేనివాడు’ అంటే సరిగా మాట్లాడలేనివాడు, అమాయకుడు అనే అర్థాలు వస్తాయి. వాక్కును ఉత్పత్తిచేసే ప్రధాన సాధనాల్లో నాలుక ఒకటి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తిండి తినటానికి కూడా నాలుక అవసరం ఎంతో ఉన్నదనే విషయాన్ని మనం మరవకూడడు. నోట్లో వేసుకున్న ఆహారం లోపలికి పోవాలంటే నాలుక కదలాల్సిందే. నలుక కదులుతున్నది కదా అని ఎక్కువ తింటే ప్రాణహాని కలుగుతుంది. మితాహారం, హితాహారం, మితభాషణం, హితభాషణం ముఖ్యమనే విషయాన్ని మనం గుర్తించాలి.

శరీరాన్ని నిలుపుకోవటానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. అందుకే మహర్షులు తమ పిడికిలిలో పట్టినంత ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు, కాబట్టే వారిని ‘ముష్టింపచులు’ అన్నారు.

నాలుక మంచిని పలుకుతుంది, చెడును ఉచ్చరిస్తుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పరహితాన్ని కోరే ప్రియవాక్కులు పలకాలి. వాక్కు బాణం కంటే పదునైంది. కఠినమైన వాక్కు కలకాలం బాధపెడుతుంది. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోటిదురుసుగా మాట్లాడి శిశుపలుడు ప్రాణాలకే ముప్పుతెచ్చుకున్నాడనే విషయాన్ని మనం మరవకూడదు. అందుకే మితంగా తిందాం! హితంగా మాట్లాడుదాం!!

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

చెంప దెబ్బ

Posted on జూలై 14, 2009. Filed under: నస్రుద్దిన్ గాధలు | ట్యాగులు:, , , , , , |

నస్రుద్దిన్ హోడ్జా బజారులో ఉండగా, ఒక అపరిచితుడు నస్రుద్దిన్ దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టిన తర్వాత “నన్ను క్షమించండి. మిమ్ములను వేరొకరని పొరబడ్డాను”‌ అని అన్నాడు.

ఆ సమాధానముతో‌ తృప్తి చెందని నస్రుద్దిన్, ఆ అపరిచితుడిని ఖాది దగ్గరకు తీసుకెళ్లి పరిహారము కోరాడు. ఆక్కడికి వచ్చాక, ఖాది మరియు ఆ అపరిచితుడు మంచి మిత్రులని గ్రహించాడు నస్రుద్దిన్. అపరిచితుడు తన తప్పును అంగీకరించిన తర్వాత, న్యాయమూర్తి అయిన ఖాది  “తప్పుచేసిన అపరాధి, బాధితుడికి ఒక అణా పరిహార రుసుముగా చెల్లించాలి. ఒకవేళ, తన దగ్గర ఒక అణా ఇప్పుడు లేకున్నచో, తనకు వీలైన రోజున చెల్లించవచ్చు” అని తన తీర్పును వినిపించాడు.

ఆ తీర్పు విన్న అపరాధి తన దారిన తాను వెళ్లిపోయాడు. నస్రుద్దిన్ తను పొందవలసిన అణా కొరకు వేచిచూచెను. కానీ ఏమి లాభం లేదు. అతను చాలా కాలము వేచి వుండవలసి వచ్చింది.

కొన్నాళ్ల తర్వాత నస్రుద్దిన్ ఖాది దగ్గరకెళ్ళి “ఒక చెంప దెబ్బకు పరిహారముగా ఒక అణా చెల్లస్తే సరిపోతుందా?” అని ప్రశ్నించాడు.

దానికి “అవును”అని ఖాది సమాధానము ఇచ్చాడు.

ఆ సమాధానము విన్న నస్రుద్దిన్, న్యాయమూర్తి అయిన ఖాది చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి  “ఆ అపరాధి నాకు ఒక అణా ఇచ్చినప్పుడు, దానిని మీరే ఉంచేసుకోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

« పాత ఎంట్రీలు

Liked it here?
Why not try sites on the blogroll...