నీకు నీవే విధాతవి

Posted on జూలై 12, 2009. Filed under: కథా స్రవంతి | ట్యాగులు:, , , , , , , |


లోకంలో చాలా మంది తమ సుఖదుఃఖాలకు, కష్టనష్టాలకు విధాత నొసట రాసిన గీతలే కారణంగా భావిస్తుంటారు. అది కొంతవరకే నిజం. ప్రతివ్యక్తీ తనకు తానే విధాత అనే సత్యాన్ని గ్రహించడు.
అదెలాగో చూద్దాం!

మాధవపురంలో సుమతి, కుమతి అనే ఇద్దరు సోదరులుండేవారు. తండ్రి భూస్వామికావటంవల్ల, తండ్రి మరణానంతరం ఇద్దరికీ విలువైన ఆస్తులు వచ్చాయి. కుమతి పేరుకు తగినట్లే చిన్నతనం నుండీ అసూయాపరుడు. పరమ సోమరికావడంతో తండ్రికి ఏ పనిలోనూ సాయం చేసేవాడు కాదు. ఇందుకు విరుద్ధంగా సుమతి తండ్రికి అన్నిపనుల్లోను సాయపడేవాడు. ఉపకారస్వభావం కలవాడు కాబట్టి, ఊరి వారిని కూడా అవసరాన్నిబట్టి అదుకునేవాడు.

కుమతి తన పొలాన్ని ఒక కౌలుదారుకి ఇచ్చాడు. అతను పచ్చి మోసగాడు. సమృద్ధిగా పంటలు పండినా, ఏదో వంకలు చూపి, కౌలుధనాన్ని బాగా తగ్గించి ఇస్తుండేవాడు. నిజానిజాలు తెలుసుకోవటంపట్ల ఆసక్తి లేని కుమతి కౌలుదారు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు. ఇంట్లో భార్య బాగా దుబారామనిషి, విచ్చలవిడిగా ఖర్చులు చెయ్యటం, ఆహారపదార్థాలు వృధా చెయ్యటంలో ఎంత డబ్బూ చాలేది కాదు. చివరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే అదనుగా భావించి ఋణ దాతలు అతనిచేత ఖాళీపత్రాలమీద సంతకాలు చేయించుకున్నారు. అడిగినప్పుడల్లా కాస్తో కూస్తో ఇస్తూ, హెచ్చు వడ్డీలు కలిపి, చివరికి రుణం కింద ఆస్తినంతా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికిగాని కుమతి కళ్ళు తెరుచుకోలేదు. భార్యాబిడ్డలతో ఒక సత్రంలో చేరాడు. అక్కడ మూడురోజులే ఉచిత భోజనం పెడతారు. ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే.

సుమతి తమ్ముడి దీనస్థితికి విచారించి, భార్య సలహా మీద సకుంటుంబంగా తన ఇంటికి ఆహ్వానించాడు.

కుమతి అన్న ఇంట్లో మకాం పెట్టినా, పాత అలవాట్లు మానలేదు. ఏ పనిమీదా ఆసక్తి చూపడు. పగలంతా బలాదూరు తిరగటం, రాత్రికి ఇంటికి చేరి సుష్ఠుగా భోజనం చేసి, విశ్రమించటం దినచర్యగా పెట్టుకున్నాడు.

ఇక కుమతి భార్య కుసుమ కుడా పాతపోకడలు వదల్లేదు. స్వతంత్రంగా ఇల్లంతా కలియతిరుగుతూ, తానే యజామానురాలిగా ప్రవర్తిస్తూ, నౌకర్లకి హుకూం జారీచేస్తూ, తన ప్రవర్తనతో అందరికీ విసుగు కలిగించింది. కుమతి అవసరాలకి సుమతి కొంతధనం ఇస్తున్నా, తృప్తిపడక అన్నపేరు మీద అప్పులు చేయసాగాడు. కొన్నాళ్ళకు అప్పులవాళ్ళు నిలదీసేసరికి, వెళ్ళి తన అన్నని అడగమన్నాడు. అప్పులవాళ్ళు వెళ్ళి కుమతి బాకీల గురించి సుమతిని అడిగేసరికి ఆశ్చర్యపోయాడు. విషయం అంతా తెల్సుకుని, తమ్ముడిని కూడా విచారించి, మరోమాట లేకుండా బాకీలు చెల్లించేశాడు సుమతి.

ఇక లాభం లేదని, తనతో బాటు రోజూ పొలానికి వచ్చి పనులు చేయమని చెప్పాడు. కుమతి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఊళ్లో తమ్ముడికి ఎవరూ అప్పులివ్వకుండా కట్టడిచేశాడు. మరదలిని గట్టిగా మందలిచడంతో ఆమె ధోరణి మార్చుకుంది.

ఇలా ఉండగా ఆ ఊళ్లోకి ఒక వేదాంతి వచ్చాడు. శివాలయంలో సభపెట్టి ‘విధాత రాసే రాతలే మన జీవితాల్ని శాసిస్తాయి. కాబట్టి మన కష్టసుఖాలకు మనం బాధులుం కాదు’ అని బోధించాడు. కుమతి ఈ బోధని బాగా వంటపట్టించుకుని, ఆ విషయమే అన్నకి చెప్పాడు.

సుమతి నవ్వి “విధాతకి తండ్రి అయిన పరమాత్మ; కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కష్టజీవిని, నిజాయితీపరుణ్ణి, దైవాన్ని గాఢంగా విశ్వసించే భక్తుణ్ణి విధాత రాతలేమీ చెయ్యలేవు. పైగా అలాంటివాళ్ళు తమజీవితాలను తాము కోరినవిధంగా మలుచుకోగలరు. అంటే, వారికివారే విధాతలు” అన్నాడు. కుమతి ఈ మాటల్ని వ్యతిరేకించాడు.

“ఒక ఏడాది నేను చెప్పినట్లు చెయ్యి, నా మాటలు నిజమని నిరూపిస్తా”నన్నాడు సుమతి. ‘సరే’నన్నాడు కుమతి.

తెలిసినవారి దగ్గర ఇరవై ఎకరాల భూమిని తమ్ముడి కోసం కౌలుకి తీసుకున్నాడు సుమతి. దగ్గరుండి, వ్యవసాయపనులన్నీ తమ్ముడిచేతనే చేయించాడు. లోలోపల మండిపోతున్నా అన్నకిచ్చిన మాటకోసం అన్ని కష్టాలూ భరించాడు. ఏడాదయ్యేసరికి అనుకున్నదానికన్నా ఎంతో ఎక్కువగా పంట పడింది. పెట్టుబడికి పదిరెట్ల లాభం వచ్చింది. కుమతి తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. సుమతి ఆ డబ్బుకి మరికొంత కలిపి, అప్పులవాళ్ళు స్వాధీనం చేసుకున్న ఇల్లు విడిపించి, అందులో తమ్ముడి కుటుంబానికి ప్రవేశం కల్పించాడు.

“ఇప్పుడేమంటావు?” అని తమ్ముడ్ని ప్రశ్నించాడు సుమతి.

“ఏదో ఒక ఏడాది జరిగిందని ప్రతి ఏడాదీ జరుగుతుందా?” అన్నాడు కుమతి పెదవి విరుస్తూ.

“సరే ఈ ఏడాదికూడా నేను చెప్పినట్లు విను” అన్నాడు సుమతి. కుమతి ఒప్పుకున్నాడు.

ఆ ఏడాదికూడా సుమతి దగ్గరుండి అదే పొలాన్ని సాగు చేయించాడు, గత ఏడాదికంటే కూడా అధిక ఫలసాయం వచ్చింది. ఈమాటు తమ్ముడు పోగొట్టుకున్న పొలాల్లో కొన్ని తిరిగి కొనిపెట్టాడు. మూడో ఏడు కుమతి అన్న చెప్పకుండానే, స్వయంగా వ్యవసాయపనుల్లోకి దిగాడు. ఇలా అయిదో సంవత్సరం పూర్తయ్యేసరికి పోయిన ఆస్తికి మించి ఆస్తి సంపాదించాడు కుమతి.

భార్యాభర్తలిద్దరూ అన్నగారి కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించి విందుభోజనాలు పెట్టి, ఖరీదైన బట్టలు పెట్టి పాదాలకు నమస్కరించారు.

సుమతి నవ్వుతూ “ఇప్పుడు నీకు నువ్వే విధాతవేనా?” అనడిగాడు.

“ఇక సందేహించటానికి ఏముంది?” అన్నాడు కుమతి. అటుపైన అందరికీ తన కథే చెబుతూ, “ఎవరికి వరే విధాతలు” అంటూ ప్రచారం చేయసాగాడు కుమతి.

అన్న అడుగుజాడల్లో నడుస్తూ సుఖసౌఖ్యాలతో, గౌరవంగా జీవించసాగాడు కుమతి.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

2 వ్యాఖ్యలు to “నీకు నీవే విధాతవి”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

wow ! wonderful stories ! I love your blog ! please keep writing more !

మరోమారు మీరు మీ అభిప్రాయములు తెలిపేటప్పుడు, మీ పేరు తెలపడం మరవకండి.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: