కథా స్రవంతి

పరమళించిన మానవత్వం

Posted on ఆగస్ట్ 19, 2009. Filed under: కథా స్రవంతి | ట్యాగులు:, , , , , , , , , , , , , |

అది కొండలపై వెలసిన దేవాలయం. దైవ దర్శనం కోసం వేలాది భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన మెట్లెక్కి దేవుని దర్శించి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుంటారు. ఒక భక్త బృందం మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ గుంపులో కాళ్ళులేని ఒక వికలాంగుడు మెట్లెక్కలేక ప్రయాసపడుతూ ప్రాకుతూ, చెమటలు కార్చుకుంటూ మెట్లెక్కుతున్నాడు. చకచకా ముందుకు సాగుతున్న భక్తులెవరూ ఈ వికలాంగుని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా ఒక భక్తుడు మాత్రం వికలాంగుని దీనావస్థ చూచి జాలిపడి అతనిని తన భుజాలపై నెక్కించుకొని యాత్రికుల గుంపు వెనుక మెట్లుక్కుతూ ముందుకు మెల్లమెల్లగా సాగుతున్నాడు.

ముందుగా వెళ్ళిన భక్తులు గుడికి చేరి దైవదర్శనానికి గుడిదగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడు మాయమైనందుకు అందరూ ఆశ్చర్యచకితులై ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా కొంతసేపటికి వికలాంగుని ప్రయాసతో మోసుకొని వస్తున్న భక్తుడు గుడిముందు అతనిని దించగానే వికలాంగుడు మాయమైనాడు. గర్భగుడిలో యధాస్థానంలో భగవుంతుడు ప్రత్యక్షమైనాడు. భక్తులంతా ఆశ్చర్యచకితులైనారు.

భగవంతుడు సర్వమానవాళికి తండ్రి. కోర్కెలు తీర్చుకోవడానికి దేవుని ప్రార్థించడం కన్నా సాటి మానవుని నిస్వార్థ ప్రేమతో సేవిస్తే భగవుంతుడు సంతసిస్తాడు. ప్రేమను గురించి పలుమార్లు ప్రవచనాలు చేయుదానికన్నా ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థప్రేమను ప్రదర్శించే భక్తుడు మిన్న.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

చెంప దెబ్బ

Posted on జూలై 14, 2009. Filed under: నస్రుద్దిన్ గాధలు | ట్యాగులు:, , , , , , |

నస్రుద్దిన్ హోడ్జా బజారులో ఉండగా, ఒక అపరిచితుడు నస్రుద్దిన్ దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టిన తర్వాత “నన్ను క్షమించండి. మిమ్ములను వేరొకరని పొరబడ్డాను”‌ అని అన్నాడు.

ఆ సమాధానముతో‌ తృప్తి చెందని నస్రుద్దిన్, ఆ అపరిచితుడిని ఖాది దగ్గరకు తీసుకెళ్లి పరిహారము కోరాడు. ఆక్కడికి వచ్చాక, ఖాది మరియు ఆ అపరిచితుడు మంచి మిత్రులని గ్రహించాడు నస్రుద్దిన్. అపరిచితుడు తన తప్పును అంగీకరించిన తర్వాత, న్యాయమూర్తి అయిన ఖాది  “తప్పుచేసిన అపరాధి, బాధితుడికి ఒక అణా పరిహార రుసుముగా చెల్లించాలి. ఒకవేళ, తన దగ్గర ఒక అణా ఇప్పుడు లేకున్నచో, తనకు వీలైన రోజున చెల్లించవచ్చు” అని తన తీర్పును వినిపించాడు.

ఆ తీర్పు విన్న అపరాధి తన దారిన తాను వెళ్లిపోయాడు. నస్రుద్దిన్ తను పొందవలసిన అణా కొరకు వేచిచూచెను. కానీ ఏమి లాభం లేదు. అతను చాలా కాలము వేచి వుండవలసి వచ్చింది.

కొన్నాళ్ల తర్వాత నస్రుద్దిన్ ఖాది దగ్గరకెళ్ళి “ఒక చెంప దెబ్బకు పరిహారముగా ఒక అణా చెల్లస్తే సరిపోతుందా?” అని ప్రశ్నించాడు.

దానికి “అవును”అని ఖాది సమాధానము ఇచ్చాడు.

ఆ సమాధానము విన్న నస్రుద్దిన్, న్యాయమూర్తి అయిన ఖాది చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి  “ఆ అపరాధి నాకు ఒక అణా ఇచ్చినప్పుడు, దానిని మీరే ఉంచేసుకోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

నీకు నీవే విధాతవి

Posted on జూలై 12, 2009. Filed under: కథా స్రవంతి | ట్యాగులు:, , , , , , , |

లోకంలో చాలా మంది తమ సుఖదుఃఖాలకు, కష్టనష్టాలకు విధాత నొసట రాసిన గీతలే కారణంగా భావిస్తుంటారు. అది కొంతవరకే నిజం. ప్రతివ్యక్తీ తనకు తానే విధాత అనే సత్యాన్ని గ్రహించడు.
అదెలాగో చూద్దాం!

మాధవపురంలో సుమతి, కుమతి అనే ఇద్దరు సోదరులుండేవారు. తండ్రి భూస్వామికావటంవల్ల, తండ్రి మరణానంతరం ఇద్దరికీ విలువైన ఆస్తులు వచ్చాయి. కుమతి పేరుకు తగినట్లే చిన్నతనం నుండీ అసూయాపరుడు. పరమ సోమరికావడంతో తండ్రికి ఏ పనిలోనూ సాయం చేసేవాడు కాదు. ఇందుకు విరుద్ధంగా సుమతి తండ్రికి అన్నిపనుల్లోను సాయపడేవాడు. ఉపకారస్వభావం కలవాడు కాబట్టి, ఊరి వారిని కూడా అవసరాన్నిబట్టి అదుకునేవాడు.

కుమతి తన పొలాన్ని ఒక కౌలుదారుకి ఇచ్చాడు. అతను పచ్చి మోసగాడు. సమృద్ధిగా పంటలు పండినా, ఏదో వంకలు చూపి, కౌలుధనాన్ని బాగా తగ్గించి ఇస్తుండేవాడు. నిజానిజాలు తెలుసుకోవటంపట్ల ఆసక్తి లేని కుమతి కౌలుదారు ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు. ఇంట్లో భార్య బాగా దుబారామనిషి, విచ్చలవిడిగా ఖర్చులు చెయ్యటం, ఆహారపదార్థాలు వృధా చెయ్యటంలో ఎంత డబ్బూ చాలేది కాదు. చివరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే అదనుగా భావించి ఋణ దాతలు అతనిచేత ఖాళీపత్రాలమీద సంతకాలు చేయించుకున్నారు. అడిగినప్పుడల్లా కాస్తో కూస్తో ఇస్తూ, హెచ్చు వడ్డీలు కలిపి, చివరికి రుణం కింద ఆస్తినంతా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికిగాని కుమతి కళ్ళు తెరుచుకోలేదు. భార్యాబిడ్డలతో ఒక సత్రంలో చేరాడు. అక్కడ మూడురోజులే ఉచిత భోజనం పెడతారు. ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే.

సుమతి తమ్ముడి దీనస్థితికి విచారించి, భార్య సలహా మీద సకుంటుంబంగా తన ఇంటికి ఆహ్వానించాడు.

కుమతి అన్న ఇంట్లో మకాం పెట్టినా, పాత అలవాట్లు మానలేదు. ఏ పనిమీదా ఆసక్తి చూపడు. పగలంతా బలాదూరు తిరగటం, రాత్రికి ఇంటికి చేరి సుష్ఠుగా భోజనం చేసి, విశ్రమించటం దినచర్యగా పెట్టుకున్నాడు.

ఇక కుమతి భార్య కుసుమ కుడా పాతపోకడలు వదల్లేదు. స్వతంత్రంగా ఇల్లంతా కలియతిరుగుతూ, తానే యజామానురాలిగా ప్రవర్తిస్తూ, నౌకర్లకి హుకూం జారీచేస్తూ, తన ప్రవర్తనతో అందరికీ విసుగు కలిగించింది. కుమతి అవసరాలకి సుమతి కొంతధనం ఇస్తున్నా, తృప్తిపడక అన్నపేరు మీద అప్పులు చేయసాగాడు. కొన్నాళ్ళకు అప్పులవాళ్ళు నిలదీసేసరికి, వెళ్ళి తన అన్నని అడగమన్నాడు. అప్పులవాళ్ళు వెళ్ళి కుమతి బాకీల గురించి సుమతిని అడిగేసరికి ఆశ్చర్యపోయాడు. విషయం అంతా తెల్సుకుని, తమ్ముడిని కూడా విచారించి, మరోమాట లేకుండా బాకీలు చెల్లించేశాడు సుమతి.

ఇక లాభం లేదని, తనతో బాటు రోజూ పొలానికి వచ్చి పనులు చేయమని చెప్పాడు. కుమతి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఊళ్లో తమ్ముడికి ఎవరూ అప్పులివ్వకుండా కట్టడిచేశాడు. మరదలిని గట్టిగా మందలిచడంతో ఆమె ధోరణి మార్చుకుంది.

ఇలా ఉండగా ఆ ఊళ్లోకి ఒక వేదాంతి వచ్చాడు. శివాలయంలో సభపెట్టి ‘విధాత రాసే రాతలే మన జీవితాల్ని శాసిస్తాయి. కాబట్టి మన కష్టసుఖాలకు మనం బాధులుం కాదు’ అని బోధించాడు. కుమతి ఈ బోధని బాగా వంటపట్టించుకుని, ఆ విషయమే అన్నకి చెప్పాడు.

సుమతి నవ్వి “విధాతకి తండ్రి అయిన పరమాత్మ; కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. కష్టజీవిని, నిజాయితీపరుణ్ణి, దైవాన్ని గాఢంగా విశ్వసించే భక్తుణ్ణి విధాత రాతలేమీ చెయ్యలేవు. పైగా అలాంటివాళ్ళు తమజీవితాలను తాము కోరినవిధంగా మలుచుకోగలరు. అంటే, వారికివారే విధాతలు” అన్నాడు. కుమతి ఈ మాటల్ని వ్యతిరేకించాడు.

“ఒక ఏడాది నేను చెప్పినట్లు చెయ్యి, నా మాటలు నిజమని నిరూపిస్తా”నన్నాడు సుమతి. ‘సరే’నన్నాడు కుమతి.

తెలిసినవారి దగ్గర ఇరవై ఎకరాల భూమిని తమ్ముడి కోసం కౌలుకి తీసుకున్నాడు సుమతి. దగ్గరుండి, వ్యవసాయపనులన్నీ తమ్ముడిచేతనే చేయించాడు. లోలోపల మండిపోతున్నా అన్నకిచ్చిన మాటకోసం అన్ని కష్టాలూ భరించాడు. ఏడాదయ్యేసరికి అనుకున్నదానికన్నా ఎంతో ఎక్కువగా పంట పడింది. పెట్టుబడికి పదిరెట్ల లాభం వచ్చింది. కుమతి తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. సుమతి ఆ డబ్బుకి మరికొంత కలిపి, అప్పులవాళ్ళు స్వాధీనం చేసుకున్న ఇల్లు విడిపించి, అందులో తమ్ముడి కుటుంబానికి ప్రవేశం కల్పించాడు.

“ఇప్పుడేమంటావు?” అని తమ్ముడ్ని ప్రశ్నించాడు సుమతి.

“ఏదో ఒక ఏడాది జరిగిందని ప్రతి ఏడాదీ జరుగుతుందా?” అన్నాడు కుమతి పెదవి విరుస్తూ.

“సరే ఈ ఏడాదికూడా నేను చెప్పినట్లు విను” అన్నాడు సుమతి. కుమతి ఒప్పుకున్నాడు.

ఆ ఏడాదికూడా సుమతి దగ్గరుండి అదే పొలాన్ని సాగు చేయించాడు, గత ఏడాదికంటే కూడా అధిక ఫలసాయం వచ్చింది. ఈమాటు తమ్ముడు పోగొట్టుకున్న పొలాల్లో కొన్ని తిరిగి కొనిపెట్టాడు. మూడో ఏడు కుమతి అన్న చెప్పకుండానే, స్వయంగా వ్యవసాయపనుల్లోకి దిగాడు. ఇలా అయిదో సంవత్సరం పూర్తయ్యేసరికి పోయిన ఆస్తికి మించి ఆస్తి సంపాదించాడు కుమతి.

భార్యాభర్తలిద్దరూ అన్నగారి కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించి విందుభోజనాలు పెట్టి, ఖరీదైన బట్టలు పెట్టి పాదాలకు నమస్కరించారు.

సుమతి నవ్వుతూ “ఇప్పుడు నీకు నువ్వే విధాతవేనా?” అనడిగాడు.

“ఇక సందేహించటానికి ఏముంది?” అన్నాడు కుమతి. అటుపైన అందరికీ తన కథే చెబుతూ, “ఎవరికి వరే విధాతలు” అంటూ ప్రచారం చేయసాగాడు కుమతి.

అన్న అడుగుజాడల్లో నడుస్తూ సుఖసౌఖ్యాలతో, గౌరవంగా జీవించసాగాడు కుమతి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

బుర్ఖా

Posted on జూలై 6, 2009. Filed under: నస్రుద్దిన్ గాధలు | ట్యాగులు:, , |

నస్రుద్దిన్ హోడ్జా మొదటి వివాహము, పెద్దలు కుదిర్చిన వివాహము. దానికి తోడు, అప్పటి ఆచారం ప్రకారం అతను వధువును పెళ్లికి ముందు చూడలేదు. పెళ్లి రోజున మొదటి సారి వధువును చూసిన తర్వాత ఆమె మొహము నచ్చక, నిరాశ చెందాడు.

ఆ మరుసటి దినము అతని భార్య  బజారుకు వెళ్ళుటకు తయారవుతూ, అప్పటి ఆచారాని పాటిస్తూ “ఏమండి, నేను బుర్ఖా తొడిగి వెళ్లనా? నేను మీ‌ అనుమతి లేనిది ఎవ్వరికీ నా మొహం చూపను”‌అని తన భర్తతో అన్నది.

దానికి సమాధానముగా నస్రుద్దిన్ ఇలా అన్నాడు “నువ్వు బుర్ఖా తొడిగైనా వెళ్ళు, లేక  తొడగకనైనా వెళ్ళు. నువ్వు నీ మొహాన్ని జనంలో ఎవరికి చూపినా, నాకు పెద్దగా తేడా లేదు. కానీ, ఇంట్లో ఉన్నంత వరకూ బుర్ఖా తొడిగి ఉండు.”

టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

నరుడి బ్రతుకు నటన

Posted on జూన్ 10, 2009. Filed under: కథా స్రవంతి |

ఇప్పుడే అందిన వార్త: నక్సలైట్లపై పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు రామ్ కుమార్ కూడా మృతిచెందాడు. తన కారు చెడిపోవడంతో అటుగా వస్తున్న నక్సలైట్లు వ్యానును గుర్తించకుండా లిఫ్ట్    అడిగి , ఎక్కడంతో ఆయనకు ఈ ప్రమాదం సంభవించినట్లు రామ్ కుమార్ కారుడ్రైవరు గోవిందం తెలిపాడు” అని ప్రముఖ టీ.వి.చానళ్ళలోని వార్తల్లోని ముఖ్యాంశాలలో ఆయన మృతివార్తను ప్రసారం చేయడం జరిగింది!

******************
ఆ వార్త విన్న సీత గుండె గుభేలుమంది! ఇక తనకి దిక్కెవరన్నట్లు కూలబడిపోయింది. ఇంట్లో ఏమని చెప్పలో తెలియక, తనలోతాను సతమతమవుతున్నది. వీరు ప్రేమించుకున్నారన్న సంగతి తెలిసిన తల్లిదండ్రులు సీతను ఓదార్చారు.

******************
సీతా, రామ్ లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ పోటోపడి మరీ చదివేవారు! వారిద్దరిలోనే ఎప్పుడూ కాలేజీ ఫస్టూ, సెకండూనూ! ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో వాళ్ళ పరిచయం ప్రణయమై, పరిణయానికి దారితీసింది.

సీతా, రామ్ లు తమ పెద్దవాళ్ళతో  చెప్పి పెళ్ళి చేసుకుందామనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. రామ్ కుమార్ నడవడిక, సత్ప్రవర్తన చూసిన సీత తల్లిదండ్రులు వారి పెళ్ళికి తమకేమి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక రామ్ తల్లిదండ్రులని మాత్రమే ఒప్పించాలని అనుకున్నాడు.

ఎయ్.బి.ఎ. ఫైనలియర్ ఎగ్జామ్స్    అయిపోవడంలతో రామ్ తమ పెళ్ళివిషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పి ఒప్పిస్తానని, తన మాటను తన తల్లిదండ్రులు ఎప్పుడూ కాదనరనీ సీతకు చెప్పి, తన ఊరు ప్రయాణమయ్యాడు.

కానీ,ఇంతలోనే ఈ దుస్సంఘటాన సంభవించింది. సీత భోరున ఏడుస్తూ కూలబడింది. తీవ్రమైన మనస్తాపానికి లోనై, ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పడంతో తిరిగి కోలుకుంటోంది!

అర్థరాత్రి అపరాత్రులు కూడా సీత నిద్రలోంచి ఉలిక్కిపడిలేచి ఏడ్చేది. తాను ఎంతగానో ప్రేమించిన రామ్ ని దూరం చేసిన ఆ దేవుణ్ణి సైతం నిందించేది.

“ఎంత ఏడిస్తే మాత్రం పోయినోళ్ళు తిరిగివస్తారా? ఊరుకోమ్మా! … ఊరుకో!..” అని సీతను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ఓదార్చారు.

అప్పుడు చెప్పింది సీత గుండెలు బద్దలయ్యేలాంటి వార్తొకటి! తాను గర్భవతినని, తన కడుపులో రమ్ కుమార్ ప్రతిరూపం పెరుగుతోంది! ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. బోరున ఏడుస్తున్న కూతురును తాము ఓదార్చాల్సింది పోయి, తామే పసిపిల్లల్లా బోరున విలపిస్తున్నారు.

“ఇంక.. ఈ విషయం ఇంతటిటో మర్చిపొమ్మని చెప్పి, సీతకు అబార్షన్ చేయించాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. దానికి సీత ఏమాత్రం అంగీకరించలేదు. పోనీ రామూ విషయం దాచి, సీతకు ఓ మంచి సం బంధం చేయాలనుకున్నరు. దానికీ సీత ససేమిరా అంగీకరించలేదు.

“కవిత!.. వనిత!.. లత!.. ఆశ్రయం లేనిదే శోభిల్లవమ్మా! చెప్పిన మాట వినమ్మా!.. మేమునంతవరకు నీకు రక్షణ.. మేమిద్దరం దాటిపోతే .. నీకు రక్షణ కావాలి కదా! తల్లీ! కాదనకు..” అంటూ సీతను ఆమె తల్లిదండ్రులు బ్రతిమాలారు. సీత “సరే మే ఇష్టం!” అంది. అమ్మా, నాన్నా సంబంధం తెచ్చినప్పుడు కదా చూసుకునేది అనుకుంది.
******************
తక్కువస్థాయి నుంచి బాగా కష్టపడి పైకొచ్చి, ఇప్పుడు మంచి పొజీషన్ లో ఉన్న ఓక మంచి సంబంధం సీత తల్లిదండ్రులకు నచ్చింది.

కష్టపడి పైకివచ్చినవారు కనుక కష్ట, సుఖాలు తెలుస్తాయని సీతకు నచ్చజెప్పి, పెళ్ళిచూపులకు ఏర్పాటు చేశారు ఆమె తల్లిదండ్రులు.
******************
చూడానికి మర్యాదస్తుల్లా ఉన్నారు. అబ్బాయి పేరు రవి, చాలా అందంగా హూందాగా ఉన్నాడు. అతను కంప్యూటర్ ఇంజనీరుగా బెంగలూరులో జాబ్ చేస్తున్నాడు. ఎందుకో నా మనసు అంగీకరించకపోయినా పెద్దవాళ్ళని నొప్పించడం ఇష్టంలేక ఒప్పుకున్నను.

మంగళవాయిద్యాలతో, వేదమంత్రాల మధ్య మా పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. నా తల్లిదండ్రులు మా పెళ్ళిచూసి సంభరపడిపోయారు. నిండునూరేళ్ళు సుఖంగా జీవించండీ అని మా పెద్దలందరూ కలిసి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించారు. నాకు ఆనందం  కల్గినా.. నేను చేసిన తప్పు నన్ను ఏకో మూల వెంటాడుతూనే ఉంది.
*******************
‘ఏయ్ సీతా! నీవు చేస్తున్నది తప్పు! నీవు తప్పు చేసినది కాకుండా ఆ తప్పును ఇంకొకరికి రుద్దుతావా! నిజం చెప్పు! నీలో రామ్ ప్రతిరూపం పెరగడం లేదూ! రేపు పుట్టబోయే నీ‌ బిడ్డ “అమ్మా! నా తండ్రి ఎవరూ?” అని అడినితే ఎవరని చెబుతావు. బిడ్డ తండ్రి ఎవరని చెబుతావు? సిగ్గుమాలినదానా! ఇప్పుడైనా నిజం చెప్పు!.. నీ తప్పుని దిద్దుకో! .. నిజం ఒప్పుకో!.. నిజం నిప్పులాంటిది!.. దాచాలన్నా దాగదు!..నిజం నిప్పులాంటిది!.. దాచాలన్నా దాగదు!..” అని అంతరాత్మ ఎదురుపడి, శోభనం గదిలోకి వెళుతున్న సీతను నిలదీస్తూండే సరికి పాలగ్లాసు వదిలేసి సీత మూర్చబోయింది.

సీతముఖం మీద నీళ్ళు చల్లి తట్టి లేపాడు రవి. కొంతసేపటికి తేరుకొన్న సీత కళ్ళు తెరిచింది. తాను తప్పు చేసిన సంగతి, తన పెద్దవాళ్ళు ఆ తప్పును కప్పిపుచ్చిన సంగతి సీత రవితో వివరంగా చెప్పేసింది!

రవి నిశ్చేష్ఠుడై చూస్తూ.. నిల్చుండిపోయాడు.

కొంతసేపటికి తేరుకున్న రవి “నువ్వేం కంగారు పడవద్దు డియర్! నాకు పిల్లలు కలిగే భాగ్యం ఎలాగూ లేదని డాక్టలందరూ తేల్చిచెప్పేశారు, ఆ విషయం మా తల్లిదండ్రులు దాచి నన్ను నీకు అంటగట్టారు” అని రవి కూడా నిజం చెప్పేయడంతో ఈసారి ఆశ్చర్యపోవడం సీతవంతయ్యింది.

“నరుడి బ్రతుకు నటన .. ఈశ్వరుని తలపు ఘటన.. దేవుడు తన తప్పును దిద్దుకోవడానికి మనిద్దరికీ పెళ్ళి చేసుంటాడు కాబోలు! నీకు పుట్టే బిడ్డ మన బిడ్దవుతుంది!” అని రవి సీతను దగ్గరకు తీసుకుంటుంటే, సీతముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...