కూటి కోసం-కోటి విద్యలు

టంగ్ ఫూ – మాటే పంచ్

Posted on జూన్ 23, 2009. Filed under: కూటి కోసం-కోటి విద్యలు | ట్యాగులు:, , , , , , , , |

నాలుక జాగ్రత్త

కుంగ్ ఫూ ఏవిధంగా అయితే ప్రత్యర్థుల దాడినుంచి మన శరీరాన్ని రక్షిస్తుందో అలాగే టంగఫూ వాగ్భాణాలనుంచి రక్షిస్తుందనమాట. సందర్భానికి తగినట్లుగా మాట్లాడేలా నాలుకకు శిక్షణ ఇస్తామన్నమాట. ఈ అంశాలు నేర్చుకుంటే మన ఇంటిలోని వారితో,సన్నిహితులతో మరియు సహోద్యోగులతో నిర్మాణాత్మకంగా మాట్లాడవచ్చు. వివరాలలోకి తొంగిచూద్దాం…

వివరణ వద్దు

దీనినే మనం వాడుకలో “సాకులు వద్దు” అని కూడా అంటుంటాం. ఫలానా సమయానికి పూర్తవ్వాల్సిన పని కాకపోతే అవతలివారికి కోపం రావడం సహజం. అప్పుడు మనం ఏం చెప్తున్నా వారికవి సాకులుగానే విన్పిస్తాయి. అందుకే వివరణ వద్దు. తప్పయిపోయింది, క్షమించండి … అని ఒప్పుకోండి. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలో అది చేయండి. ఇప్పుడిక అవతలివారేమంటారు?

ఎపరో  చేసిన తప్పు…

ఒక్కోసారంతే… ఎపరో చేసినదానికి మనం నింద భరించాల్సివస్తుంది. నేను చేయలేదు.. అంటూ మీరు వివరించబోతే అది కాస్తా పెద్ద వాగ్వివాదానికి దారితీస్తుంది. దాని బదులు- దయచేసి మీరెందుకు అలా అనుకుంటున్నారో‌చెప్పండి… అనడగండి. అవతలివారు అది ఊహించరు. కోపం కొంచెం తగ్గి విషయం చెప్తారు. అప్పుడు మీరు ఆ పని అయ్యేలా చూస్తూ ఎక్కడ పొరపాటు జరిగిందో వారికి వివరించవచ్చు. అనవసరంగా మిమ్మల్ని అన్నందుకు వాళ్లే చింతిస్తారప్పుడు.

చెయ్యత్తితే… చాలు

అపార్థం చేసుకోకండి. ఇక్కడ చెయ్యెత్తడమంటే… పైకి లేపడం, అంతే. ఒక విషయంమీద నలుగురు కలిసి తీవ్రంగా చర్చిస్తున్నారు. వారు చెప్పేదాంతో మీరు ఏకీభవించడం లేదు. పైగా సరైన కారణం ఒకటి మీరు చెప్పాలనుకుంటున్నారు. అందుకోసం గట్టిగా చెప్పబోతే అందరూ ఇంకాస్త గట్టిగా మాట్లాడతారు. పని జరగదు. అప్పుడు మీరు మాట్లాడాకుండా చెయ్యి పైకి లేపండి. అందరూ ఒక్క క్షణం ఆగిపోతారు. అప్పుడు ‘మనం మాట్లాడుకుంటున్నది పరిష్కారాలు వెదకడం గురుంచి కానీ, ఒకరినొకరు తప్పులు పట్టుకోవడానికి కాదు…’ అనండి. తప్పకుండా పరిస్థితి అదుపులోకి వస్తుంది. అప్పటికి రాకపోతే సమయం అయిపోయిందన్న సూచన ఇవ్వండి. అంతేకానీ‌ అందరినీ పేరు పేరునా గట్టిగా పిలవడం వృథా ప్రయాసే.

సానుభూతి ఇలా….

ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. బయట భోరున వర్షం. మీరు ఒక హోటల్ రిసెప్షన్ బాధ్యతలో ఉన్నారు. బస చేసిన సందర్శకులంతా వానని తిట్టుకుంటూ పనులు వాయిదా పడుతున్నందుకు విసుగ్గా లాబీలో తిరుగుతున్నారు. అపుడు మీరు ‘క్షమించండి… నేనేం చేయలేను..’ అంటే వారికి పుండుమీద కారం చల్లినట్లుంటుంది. కానీ మనసు సాంత్వన చెందదు. నిజంగా మనం ఏమీ చేయలేం. కాకపోతే దాన్ని ఇలా చెప్పాలి… ‘ఈ సమయంలో వాన నిజంగా ఊహించనిది. ఇక్కడ వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేకుండా తయారవుతోంది. త్వరగా తగ్గిపోతుందనే ఆశిద్దాం. మీరు ఏమీ అనుకోనంటే.. లోపల ఫలానా హాల్లో నృత్య కార్యక్రమం జరుగుతోంది. వెళ్లి చూడవచ్చు. ఈలోపల వాన తగ్గిపోతే నేను వచ్చి పిలుస్తాను’ విన్నవారికి ఆ మాటలు ఎంత సాంత్వననిస్తాయో ఊహించగలరుగా.

తప్పులెంచవద్దు

మీ కిందివారు ఒక పొరపాటు చేశారు. దానికి మీరు అలా చేయకూడదు… ఇలా చేసి ఉండవలసింది… అంటూ ఉపన్యాసాలిస్తే, వాళ్లకి కోపం పెరిగిపోతుంది. ఎందుకంటే జరిగినదాన్ని ఎవరూ మార్చలేరు కాబట్టి. వళ్లనా పశ్చాత్తాపధోరణినుంచి బయటపడేయాలంటే ‘పొరపాటు సహజం. మరోసారి ఇలా చేయండి’ అంటూ  పాజిటివ్ గా చెప్తే వారు భవిష్యత్తులో ఆ తప్పు చేయరు.

నవ్వేయండి!

చిన్నప్పుడు వీధిలో ఎవరైనా పేర్లు పెట్టి వెక్కరిస్తే ఏడుస్తూ అమ్మ దగ్గరకు వెళ్తాం. పనిచేసే చోట అది కుదరదు. అందుకని ఎవరేమన్నా విని ఊరుకోవాలా? అక్కర్లేదు. నవ్వుతూ కొట్టిపారేయండి. అయినా ఉక్రోషంగా ఉంటే.. మీకు ఏమేం పేర్లు పెట్టగలరో తెలుసు కాబట్టి వారి ముందే మిమ్మల్ని మీరు ఆ పేర్లతో సంభోదించుకుని నవ్వేయండి. అప్పుడు వారి మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్క ఉండదు.

ప్రయత్నిస్తాననండి!

మీ కింది ఉద్యోగి సెలవు అడిగారు. వీల్లేదు.. మరొకరు కూడా సెలవులో ఉన్నారు.. అని మొహమ్మీద చెప్పేయొద్దు. ‘అలాగే చూద్దాం… ఇంకొకరు కూడా సెలవులో ఉన్నారు కాబట్టి వీలుని బట్టి చూద్దాం. వాళ్లు రేపు వచ్చేస్తే మీరు నిరభ్యంతరంగా సెలవు తీసుకోవచ్చు. రాకపోతే ప్రత్యామ్నాయం ఏమున్నా ఉంటుందేమో చూడాలి..’ ఇలా సానుకూలంగా మాట్లారనుకోండి. అప్పుడు అవతలివ్యక్తే  సెలవులో ఉన్న ఉద్యోగి వచ్చాకే నేను సెలవు తీసుకుంటానులే అని చెప్తాడు.

ఈ విధంగా మనం చెప్పదలచుకున్న విషయాన్నే కొన్ని పదాలను అటుఇటు చేర్చడం ద్వారా “తాన్నొవక, నొప్పించక, తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు సుమతి!!” అన్న చందాన, మన పేరు చెడకుండానే పని జరుగుతుంది. ఇదే టంగ్ ఫూ…

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...