దేశ భక్తి

ఏ జో దేశ్ హై తేరా

Posted on ఆగస్ట్ 15, 2009. Filed under: దేశ భక్తి, సంగీతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

ప్రపంచ నలుదిశలలో ఉన్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము గర్వించదగ్గరోజు. స్కూలు రోజులలోనైతే సైకిల్‌లకు, మా స్కూలు ఆటో మరియు  బస్సులకు జెండాలను కట్టేవారము. స్కూలులో ఒక అతిథి వచ్చి జెండాను ఆవిష్కరించి నాలుగు మంచి మాటలు చెప్పిన తర్వాత  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసేవారు. తర్వాత రాజ్యమంతా మాదే. ఆటపాటలు, నాటకాలు నిర్వహించేవారము. చివరన జనగణమన ఆలపించి సంబారాలకు అంతం పలికేవారము. ఇంటర్ లో ఆ అవకాశం దొరకలేదు. ఇంజనీరింగులో తిరిగి అటువంటి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంజనీరింగు కూడా అయిపోయింది. ఆ రోజులు మళ్లీ తిరిగివస్తే ఎంత బాగుండును.

అసలు విషయానికి వస్తే; నిన్న  ప్రయాణిస్తున్నప్పడు షారుక్ ఖాన్ హిందీలో నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని బాణీలు విన్నాను. ఏ.ఆర్.రెహమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆ సినిమాను పలుమార్లు చూసాను.చూసిన ప్రతీసారి ఒక మంచి అనుభూతి కలిగేది. అందులో ఒక్కొక్క పాట ఒక్కో ఆణిముత్యం. కాని ఈ రోజు ప్రత్యేకంగా చర్చించుకోవలసిన పాట ఒకటి ఉన్నది. అది “యే జో దేశ్ హై తేరా”. హిందీ బాగా అర్థమవుతుందన్న వారు ఆ పాట యొక్క చరణాలు ఇక్కడ చూడగలరు. కథా నాయకుడు అమెరికాలో 12 సంవత్సరాలు ఉండి, తిరిగి భారతదేశానికి తనిని చిన్నప్పుడు పెంచినావిడను చూడడానికి వస్తాడు. అమెరికాకు తిరిగి వెళ్లాక మన దేశంలో అతను గడిపిన క్షణాలు నెమరువేసుకుంటూనే ఉంటాడు. ఇక్కడి మనుషులు, అతని ప్రేయసి మరియు మన దేశ దుస్థితి చూసి చలించి, NASAలో తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదలి మన దేశం తిరిగి వచ్చేస్తాడు. అతడు చేసినదాన్ని నేను సమర్థిస్తున్నాను, మన దేశాన్ని మనము కాకుంటే మరెవరు కాపాడుకుంటారు?! మీరందరు ఈ సినిమా ఒకవేళ చూసివుండకపోతే తప్పక చూడవలసినదిగా నేను కోరుతున్నాను. నా నిన్నటి మరియు ఇవాల్టి టపాలను చూసి, నన్ను ప్రవాసాంధ్రులు మరియు ప్రవాసభారతీయుల వ్యతిరేకి అని దయచేసి అనుకోవద్దు.మరోమారు మీ అందరికి స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు. జై హింద్!!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 11 వ్యాఖ్యలు )

వీళ్ల గురించి ఆలోచించడం అవసరమా?!

Posted on ఆగస్ట్ 14, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , , |

రాములమ్మ(విజయశాంతి) తెలంగాణ కొరకు ఒక పార్టీని పెట్టింది, తర్వాత గద్దముక్కాయన(కే.సి.ఆర్) పార్టీలో విలీనం చేసింది. మరి ఇప్పుడు ఆ పార్టీను కూడా వీడింది. అసలు ఆమె తెలంగాణ కోసం ఏమి చేస్తున్నట్టు?!

దేవందర్ గౌడ్ తెలుగుదేశం వద్దని నవ తెలగాణ పార్టీని పెట్టాడు, ఆ పార్టీ నవ్యత్యం కోల్పోకుండానే మెగాస్టార్ పార్టీలో విలీనం చేశాడు. కాని, ఇప్పుడు ఏమైందో ఏమిటో తిరిగి సొంత గూటికి చేరాడు. అసలు ఇంత తతంగం ఎందుకు?!

అసలు వీరికి ప్రజల కంటే తెలంగాణ ముఖ్యమైందని నేను చాలా సార్లు వాపోయాను, కాని ఇప్పుడు వాళ్లు తెలంగాణ గురించి కూడా పట్టించుకోకపోవడం విడ్దూరంగా ఉంది.

అయినా చిన్న చేపలు ఏమిచేస్తాయిలే అని వారిని వదిలేద్దాం. మరి బడా చేపలు ఏమిచేస్తునట్టు అని తొంగి చూస్తే:

తొంగిచూసేంతగా అక్కడ ఏమిలేదని తెలుసుకున్నా (నిజంగా). ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడాన్ని పూర్తిగా ప్రక్కకు నెట్టి, ఒకరి మీద మరొకరు బురద చల్లుకోవటానికే సమయం కేటాయిస్తున్నారు. మన సొమ్ముతో దర్జాగా బతికేస్తున్నారు.

ఇటువంటి వారి గురించి ఆలోచించడం అవసరమా? అని నేను చాలా సార్లు అనుకునేవాడిని. కాని నిన్న నాకు జ్ఞానోదయం అయ్యింది. అసలు జరుగుతున్నది ఏమిటంటే, నాయకులు ప్రజల గూర్చి “వీళ్ల గురించి ఆలోచించడం అవసరమా?!” అని నిర్ణయించేసుకున్నారని. దీన్ని ఇలాగే వదిలేద్దమా అని అనుకుంటే మనసు ఊరుకుండడం లేదు. రేపు మన జెండా పండుగ. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా మన అభివృద్ధి నత్త నడక నడుస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి?

కొసమెరుపు: మన దేశం ఇంతే అని సర్దుకుపోయేవారు రోజుకు రోజు అధికమవుతున్నారు. దీనితో ఆగక కొంత మంది ఇక్కడ భవిష్యత్తు లేదని విదేశాలకు వెళ్లిపోతున్నారు కూడా. ఒక నెల క్రితం నా మిత్రుడు ఒకడు, బెంజు మరియు బి.యమ్.డబ్ల్యు కార్లు వీలైనంత త్వరగా కొనాలని, వారాంతాలలో  పార్టీలు చేసుకోవాలని మరియు  barbequeల కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

మన ‘జాతీయగీతం’ చరిత్ర

Posted on ఆగస్ట్ 12, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |

జనగణమన

మనభారత జాతీయచిహ్నాలలో ‘జాతీయగీతం’ ఒకటి. నేడు దేశమంతటా జాతీయగీతంగా ఆలపించబడుతున్న ‘జనగణమన’ గీత పుట్టుపూర్వోత్తరాలు, ప్రతి భారతీయుడు తెలుసుకోవటం ఎంతైనా అవసరం. జనగణమనగీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. భారతస్వాతంత్ర్య సమరంలో ‘వందేమాతరం’ గీతం విస్తృత ప్రాచుర్యం పొందినప్పటికీ ఆ గీతం లయబద్ధంగా లేదనే కారణాన జాతీయగీత ప్రతిపత్తిని పొందలేకపోయింది.

రవీంద్రనాథ్ ఠాగూర్ సంపాదకత్వంలో వెలువడే ‘తత్త్వబోధిని’ అనే పత్రికలో ‘భారతవిధాతా’ అనే శీర్షికతో తొలుత రచించారు. ఈ గీతం బెంగాలీభాషలో మొత్తం 31 చరణాలుండేది. కానీ అందులో మనం కేవలం ఏడు చరణాలు మాత్రమే ‘జాతీయగీతం’గా ఆలపిస్తున్నాం.

1911 డిసెంబర్‌లో జరిగిన కాంగ్రెస్ మమావేశపు కార్యక్రమంలో తొలుదొలతగా ఆలపింపబడిన ‘జనగణమన’ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొన్నది. జనగణమన గీతం దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు ఒకే బాణీలో కాక వివిధ రకాల బాణీలతో గానం చేయబడేది.

జాతీయగీత ‘స్వరకల్పన’

జాతీయగీతానికి నేడు మనం పాడుకొనే బాణీని కూర్చిన ఘనత చిత్తూరు జిల్లా ‘మదనపల్లె’కు చెందిన శ్రీమతి ‘మార్గరెట్ కజిన్స్ ‘కే దక్కటం విశేషం. దక్షిణభారత పర్యటన నిమిత్తం విచ్చేసిన ‘ఠాగుర్’ బాగా అలసిపోయి అస్వస్థతకు గురై మదనపల్లెలోని థియోసాఫికల్ కాలేజి హాస్టల్‌లో 1919 ఫిబ్రవరిలో విశ్రాంతి తీసుకోవటం జరిగింది. ఈ సమయంలో ‘జనగణమన’ గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ పేరిట అనువదించి ఆ కళాశాలకు బహూకరించాడు.

ఠాగూర్ హాస్టల్‌లో విశ్రాంతి తీసుకొంటున్న తరుణంలో ‘డాక్టర్ బె.హెచ్.కజిన్స్ ‘ గారి సతీమణి ‘మార్గరెట్ కజిన్స్ ‘ మన జనగణమన గీతానికి మధురమైన స్వరకల్పన చేయగా, కళాశాల విద్యార్థినీ బృందం గానం చేయగా, ఠాగూర్ ఎంతో పరవశించి మార్గరెట్ కజిన్స్  ను అభినందించి ఆ బాణీ ఎంతో బాగా ఉందని ప్రశంచించారు. 1911 నుండి 1919 వరకు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో పాడబడిన ‘జనగణమన’ ఆ తర్వాత  ‘మార్గరెట్ కజిన్స్ ‘ కూర్చిన బాణీలోనే ఆలపించబడి, నేటికీ ఆ బాణీలోనే ఆలపించబడుతున్నది. ఇది ఆంధ్రులకెల్ల అత్యంత గర్వకారణం. జాతీయగీతానికి ఆంధ్రరాష్ట్రంలో స్వరకల్పన గావించబడటం ఆంధ్రులకు మరుపురాని మహత్తర సువర్ణఘట్టమనే చెప్పాలి.

నాటి భారత ప్రధాని ‘జవహర్‌లాల్‌నెహ్రూ’తన ఒకానొక గ్రంథములో ‘జనగణమన’ గీతం జాతీయగీత అర్హతకు తగినదని ప్రశసించారు. 1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో నాటి రాష్ట్రపతి డా॥రాజేంద్రప్రసాద్ గారు ‘జనగణమన’ను జాతీయగీతంగా అధికార ప్రకటన చేసి, ‘వందేమాతరం’ గీతానికి సమాన ప్రతిపత్తినిచ్చారు.

మన భారత జాతీయగీతమైన ‘జనగణమన’కు ప్రపంచంలోనే అతుత్తమ జాతీయగీతంగా ‘యునెస్కో’ గుర్తింపు లభ్యంకావటం భారతీయులెల్లరికీ గర్వకారణం. ప్రపంచదృష్టిని ఆకట్టుకున్న ‘జనగణమన’ గీత పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకొని ఆ గీతభావార్థాన్ని గ్రహించి, ‘జాతీయగీతం’గా ప్రగాఢ గౌరవభావంతో ఆలపించటం భారతీయులమైన మనందరి కనీసకర్తవ్యం.

జనగణమన తెలుగులో:

తెలుగులో జనగణమన

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

జపనీయుల దేశభక్తి

Posted on ఆగస్ట్ 10, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , |

రెండవ ప్రపంచయుద్ధంలో అణుబాంబులను గుండెలపై వేయించుకొని ధ్వంసమైన జపాన్ పునఃనిర్మాణమంత్రం ‘దేశభక్తి’ అంటారు. జపాన్ దేశభక్తికి ఉదాహరణగా ఒక విషయం చెబుతారు. అక్కడ బుద్ధభగవానుడిని ఎవరైనా తిడితే‌ ఏం చేస్తావని అడిగితే వాళ్ళ తల నరికేస్తానంటారట. మరి బుద్ధుడు మీ దేశాన్ని తిడితే ఏం చేస్తారంటే ‘ఆ బుద్ధుడి తలే నరుకుతాం’ అంటారత. కానీ మనం ఎవరి తలలు నరకవలసిన అవసరం లేదు. అంతర్గత బలహీనతలను , అవలక్షణాలను నరికి, ఆత్మావలోకనంలో వికసించే విధానాలను విద్యలను మనకు అందించారు భారతావని మహనీయులు.

‘రియాల్టీషో’ చూడటంలో తలమునకలౌతున్న యువతరానికి, పాటల పోటీల్లో ఓడిపోయామని కన్నీరుమున్నీరవుతున్న అమోమయం పిల్లలకి, సిరియల్స్   632వ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న మహిళామణులకి, మొత్తం మన భారతీయులందరికి చైతన్యం అందిచాలని ఆ భగవంతుడిని వేడుకుందాం.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

బలైపోతున్న భరతజాతి కుసుమాలు

Posted on జూలై 9, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , |

డాలర్ దాహంతో …. జాత్యహంకార జ్వాలల్లో… బలైపోతున్న  భరతజాతి కుసుమాలు

అభద్రత-భయం రూపాంతరం చెంది అసూయా ద్వేషాలై జాత్యహంకార సర్పం విషజ్వాలలు కక్కుతుంటే మేథస్సు, శ్రమ, నిజాయితీతో కూడిన సేవలు విస్తుపోయి కుదేలౌతున్నాయి. జీవన పోరాటంలో, కాసులవేట వ్యామోహంలో దేశ-ఖండాంతర సరిహద్దులు, సముద్రాలను దాటి వెళ్ళిన భారత యువత దిక్కుతోచని స్థితిలో దాడుల నెదుర్కొంటూ బిక్కుబిక్కుమంటుంది.

తెలివితేటలంటే ఎంత కరెన్సీ మూటకట్టాం’ అని భ్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో డాలర్ దాహంలో‌  వేల కిలోమీటర్ల దూరాలు పోయి విదేశీదాడుల్లో అస్పత్రులపాలైన తమ పిల్లల ఫోటోలను దినపత్రికల్లో, టెలివిజన్లలో  చూస్తున్న తల్లిదండ్రుల హృదయాలు ఏం చేయాలో తోచక తల్లడిల్లిపోతున్నాయి. అమెరికా-కెనడా, ఆస్ట్రేలియా-యూరోపియన్ యూనియన్, ఎమరేట్స్   -గల్ఫ్  , మలేషియా-సింగపూర్ ఇలా దేశమేదయినా, ఖండమేదయినా, సామాజిక-రాజకీయ, వ్యాపార, ఆర్థిక, పారిశ్రామిక-సాంకేతిక కళారంగమేదయినా భారతీయ మేథస్సు శ్రమ-సేవ లేకుండా ప్రస్తుత ప్రపంచ వైభవం లేదంటే అతిశయోక్తి కాదేమో! కాని ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. సుమారుగా 70-80వ దశకం వరకు భారత మేథస్సు సత్తా చాటాలనే ఎక్కువశాతం ఉద్యోగ అవకాశాల ఆహ్వానం మేరకు విదేశాలకు వెళ్ళేవారు. అప్పుడు విలువ, గౌరవం, భద్రత ఉండేవి మనవాళ్ళకు.

కాని గత 2 దశాబ్దాల నుండి కేవలం కాసులవేటే పరమావధిగా ఎలాగైనాసరే విదేశాలకు వెళ్ళాము అనిపించుకోవాలని ఫాల్స్    ప్రిస్టేజ్‌తో వెళ్ళేవాళ్ళు అధికమయ్యారు. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి/అమ్మాయి విదేశాల్లో ఉంటున్నారని చెప్పుకోవటానికి అక్కడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత చిన్నపని చేస్తున్నా గోప్యంగా ఉంచుతూ, పైకి గొప్పలు చెప్పటం మొదలు పెట్టారు. ఫలితం “ఎగబడితే ఎంగిలిస్తరాకులే దొరుకుతాయి” అన్న చందాన చిరుద్యోగులు, చీత్కారాలు ముదిరి ఇప్పుడు దాడులు రూపం దాల్చాయి. ఒక IIT ఇంజనీర్/ AIIMS డాక్టర్ తయారుకావటానికి ప్రభుత్వ ధనం అంటే పన్నుల రూపంలో మనం చెల్లించే ప్రజల సొమ్ము లక్షలు ఖర్చవుతుంది. అలాగే మిగిలిన రంగాలు ఏమైనా! మరి ఇక్కడ ప్రజల సొమ్ముతో చదివి ఆ తర్వాత ఉద్యోగం/ పై చదువు పేరుతో‌ ప్రవాసం తరలి డాలర్ల పంట పండించుకుంటూ అక్కడే తిష్టవేయాలనుకోవడం సమంజసమా! అన్నది మనం విశ్లేషించాల్సిన విషయం. మన భరతఖండానికి మూడు దిక్కులు ఆవరించి ఉన్న సముద్రజల వనరులు, భూమధ్యరేఖ, మకరరేఖ దేశం గుండా వెళుతుండటంతో ఏర్పడిన అపార ఖనిజసంపద, జీవనదులు, విస్తారమైన నేల, 120 కోట్లకు పైగా మానవ వనరులతో మనం ఎందుకు అగ్రరాజ్యాలకు ధీటుగా నిలవడానికి ఆ విదేశాలకు తరలుతున్న మేథస్సు-శ్రమ-సేవలు వినియోగించుకోవటం లేదు? అని ఆలో చించాల్సిన సమయం ఆసన్నమైంది.

‘Education’ అనే పదం ‘Edura’ అనే గ్రీకు థాతువునుండి ఉద్భవించింది. ‘Edura’ అంటే ‘అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వెలికితీసేది’ అని అర్థం. మరి ప్రతిభ శక్తివంతులైన విద్యాధికులు సామాన్యంగా మిగిలిఉన్న మానవ వనరులను వినియోగించుకొని తన చుట్టూ ఉన్నవారందరికీ ఉపయోగపడాలి కాని, మాకు ఉపాధి .. బ్రతుకుతెరువంటూ ప్రవాసాలకు తరలటమేమిటి? అత్యాశతో పరిమితతత్వంతో తలిదండ్రులు, స్వార్థ సంకుచితభావంతో ఏలికలు, నేనుమాత్రం బావుంటే చాలని, సంపాదనే ధ్యేయంగా యువతరం ఉంటే ఇలాంటి దాడులు యధేచ్చగా కొనసాగుతూనే ఉంటాయి. దీనికి భిన్నంగా స్పందించటానికి ఒక్కసారి అంతర్ముఖులై వివేకాన్ని తట్టిలేపండి. తెలివితేటలకు నిదర్శనం ఎంత సంపాదించాం, ఎన్ని విలాసాలు భోగభాగ్యాలు అనుభవిస్తూన్నామన్నది కాదు. ఎంత సంతోషంగా, సంతృప్తిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాము. చుట్టూ ఉన్నవారిలో ఎందరికి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలుగుతున్నాము అన్నదే నిజమైన తెలివి. “మనిషిని శాసించేది సంపద కాదు బంధం” అని మనము గుర్తించాలి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...