అర్జునుడు.. మిస్టర్ డేనీ ఓషన్..

Posted on ఆగస్ట్ 31, 2013. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , |

మహా భారతంలోని మన అర్జునుడికి, హాలివుడ్ చలన చిత్రం Ocean’s Eleven లోని డేనీ ఓషన్, వీరిరువురికి ఒక సమానత వున్నది. అది లక్ష్యంపై చెదరని దృష్టి.

గురువు చెట్టుపై వేలాడదీసిన పక్షి బొమ్మ యొక్క కన్ను లక్ష్యమని చెప్పి, దాన్ని బాణంతో ఛేదించమంటే, శిష్యులందరిలో ఒక్కొకరికి ఆ పక్షి కన్నుతో పాటు పక్షి శరీరం, చెట్టు కొమ్మలు, ఆకాశం ఇంకా ఎన్నెన్నో కనిపించాయి. కానీ అర్జునుడికి మాత్రం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించింది. అతని దృష్టి పక్షి కన్నుపై కాకుండా, మరే దాని మీదకు మారలేదు. గురువు సెలవిచ్చిన లక్ష్యాన్ని ఛేదించగలిగాడు.

Ocean’s Eleven లోని ఒక సన్నివేశం. బెనిడిక్ట్ ను దోచుకోవాలని నిశ్చయించుకున్న ఓషన్, అతని ప్రతి కదలికను అనుసరిస్తూ వుంటాడు. బెనిడిక్ట్ లాస్ వేగాస్ లోని తనకు చెందిన ఒక పాత హోటల్ భవంతిని కూల్చి, దాని స్థలంలో ఒక క్రొత్త భవంతిని కట్టడానికి నిర్ణయించి, దాన్నిబాంబులతో కూల్చేటప్పుడు, భవంతి ఎదుట ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాడు. బెనిడిక్ట్ ఆ సభలో రంగస్తలంపై నిల్చోని వుంటాడు. ఆ సభలో ఓషన్ మరియు, ఓషన్ కదలికలను మర్మంగా కనిపెడుతున్న అతని బృంద సభ్యుడు లినస్ కూడా వుంటారు. బాంబును పేల్చడానికి ట్రిగర్ ను నొక్కిన క్షణంలో, సభలోని అందరూ కూలుతున్న భవంతిని చూడడానికి వెన్నకి తలలు తిప్పుతారు, కానీ ఓషన్ మరియు లినస్ ల చూపులు మాత్రం మరలదు. ఓషన్ చూపు బెనిడిక్ట్ పై మరియు లినస్ చూపు ఓషన్ పై అలాగే వుంటుంది. చలించని దృష్టి అంటే అది. చిత్రం చివర సన్నివేశంలో ఓషన్ మరియు బృందం బెనిడిక్ట్ ను నిలువునా దోచుకుంటారు.

లక్ష్యం పైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించాక కలిగే తృప్తి మరియు ఆనందం, మరెందులోనూ పొందలేమనే నా భావన. కొన్ని కచ్చితమైన లక్ష్యాలను ప్రస్తుతం వుంచుకొని దాని వైపు కృషి సల్పుతున్న వారు మరియు గతంలో లక్ష్యం నెరవేర్చుకున్న వారు, నా భావనతో ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 2వ భాగం

Posted on నవంబర్ 4, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, లోక జ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , |

ఈ శీర్షికలోని మొదటి భాగంలో బాల్య మిత్రులను గురించి చెప్పుకొచ్చాను. బాల్యంలో కాకుండా తర్వాతి కాలంలో మనకు మిత్రులైన వారు నిజమైన స్నేహితులు కారా? అనే సందిగ్ధంతో ముగించాను.

Tell me who your friends are and I will tell you who you are” అనే సామెత ఒకటున్నది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అతని మిత్రులను బట్టి లెక్కకట్టవచ్చన్నది దీని అర్థం. అందరూ ఈ సామెతతో పూర్తిగా/పాక్షికంగా ఏకీభవించకపోవచ్చు. కాని, మన మిత్ర బృందం యొక్క ప్రభావం మాత్రం మన మీద కచ్చితంగా ఉండటం జరుగుతున్నది. మరి మన వ్యక్తిత్వం, జీవనశైలి మన మిత్రుల ఆదారంగా  ప్రభావితమవుతున్నప్పుడు, మనము స్నేహితులను ఆచితూచి జాగ్రత్తగా ఎన్నుకోవడంలో తప్పులేదని నా భావన.

మాతా పితా గురు దైవం ‘ అని అంటారు. మొదట తల్లి, తర్వాత తండ్రి, ఆ తరువాత గురువు, చిట్టచివరన దైవాన్ని ఆరాధించాలని మన పెద్దల ఉవాచ. అదే మనకు ఒక సరైన నిజమైన స్నేహితుడు గనకుంటే  అతనే మనకు లాలించే తల్లిగా, రక్షించే తండ్రిగా, దారి చూపే గురువుగా మరియు కరుణించే దైవంగా ఉంటాడు. స్నేహితుడు మనకొక అవసరం వచ్చినప్పుడు కొన్నింటికి మాత్రం ఒరిగే వ్యక్తిలా కాకుండా, మన సర్వస్వం తానై ఉంటాడు.

అమ్మానాన్నలను మనము ఎన్నుకోలేము. పుట్టుక ఆ భగవంతుని చేతిలో ఉన్నది. మన జీవితములో ఇతర వ్యక్తులకు చోటివ్వడం మాత్రం మన చేతులలో ఉన్నది. అలాగే మనలను ప్రభావితం చేసే మిత్రులను మనము చాలా జాగ్రత్తగా ఎన్నుకోవడంలో తప్పులేదు. కాని ఎన్నుకున్న తర్వాత, ఆ స్నేహ బంధాన్ని నిజాయితితో కొనసాగించాలి. మిత్రునితో ఎప్పుడూ విశ్వాసంగా ఉండాలి.

రెండేళ్ల మునపు మా కాలేజీ హాస్టలలులో రాత్రివేళల్లో  అందరూ నిద్రిస్తుండగా, నా ఆప్తమిత్రుడొకతను మరియు నేను పలు అంశములపై నాకున్న సందేహాలు మరియు అపోహలు, సామాజిక విషయాలు, సాంకేతికంశాలు ఇంకా మరెన్నో చర్చించేవాలము. స్నేహంపై నాకున్న ఒక సందేహాన్ని తీర్చుతూ “నువ్వు స్నేహం, మొదట ఏవిధంగా చేశావన్నది ముఖ్యం కాదు. కాని, ఆ తరువాత అతనితో ఎంత నిజాయితీతో ప్రవర్తిస్తున్నావన్నది ముఖ్యం” అని నాతో చెప్పిన మటలు, నాకు ఇప్పటికి గుర్తుకుంటున్నది.

ఇదివరకు ఎన్నుకోని మరి స్నేహం చేయడంలో తప్పులేదని చెప్పుకొచ్చాను. మరి మన ఎన్నిక ఏ విధంగా ఉండాలో ఈ శిర్షికలోని మూడవ టపాలో ప్రస్థావిస్తాను.

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 1వ భాగం

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

అంతస్సారం

Posted on నవంబర్ 3, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , |

రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది.

గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ‌ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే గంగావతారణానికి తరువాత జరిగిన  కథ ఒకటి తెలుసుకోవాలి. ఆ చక్రవర్తి రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరమాత్మను గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకొని తన ఆలోచనలన్నీ తన గురువుకు తెలిపాడు.

గురువు సలహామేరకు ఆ రాజు ఒక యజ్ఞం చేసి, తనకు గల సంపదనంతా ప్రజలందరికి దానం చేశాడు. కానీ, ఒక్క చక్రవర్తిత్వం మాత్రం మిగిలిపోయింది. దానిని కూడా తీసుకోమని భగీరథుడు చాలామందిని అడిగి చూశాడు. కానీ వారెవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆయన తన పొరుగురాజును ఆహ్వానించాడు. అసలు విషయం తెలియగానే ఆ రాజు భయపడి, “ఓ మహారాజా! మీరు ధర్మప్రభువులు మీ స్థానానికి నేను తగను” అని తప్పించుకోబోయాడు. భగీరథుడు అతనికి మంచిమాటలు చెప్పి ఎలాగోలా తన రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో మారువేషం ధరించి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరూ గుర్తుపట్టకుండా, పగటిపూట రహస్యంగా ఉండేవాడు. రాత్రిపూట మాత్రం భిక్షమెత్తుతూ, బిచ్చగాడిలా జీవిస్తూ ఉండేవాడు.

ఇలా కొంతకాలం జరిగిన తర్వాత, తన మనస్సులో అహంకారం నశించిందనే నమ్మకం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన పగటి పూటకూడా భిక్షమెత్తుకోసాగాడు. కొన్నిరోజులకు తన స్వరాజ్యమైన అయోధ్యకు చేరి, అక్కడకూడా భిక్షమెత్తసాగాడు. అయోధ్యలో ఎవరూ ఆయనను గుర్తించలేకపోయారు. అందువల్ల ఆయన సరాసరి రాజు వద్దకే వెళ్ళి భిక్షవేయమని అడిగాడు. ఇంతలో అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఒకడు పోలికలను బట్టి, కంఠస్వరం బట్టి భగీరథ మహారాజును గుర్తించి ప్రస్తుత రాజుకు చెప్పేశాడు. ఆ రాజు భగిరథునికి వినయంగా ప్రణమిల్లి “రాజ్యం  స్వీకరించండి” అని ప్రార్థించాడు. భగీరథుడు అందుకు ఇష్టపడక, “అయ్యా! పెట్టదలచుకుంటే నాకు భిక్షం పెట్టు, లేకపోతే లేదు” అని మొండికెత్తాడు. పాపం ఆ రాజు మారు మాట్లాడలేక భిక్షం పెట్టాడు. భగీరథుడు ఎంతో సంతోషంతో ఆ భిక్ష తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి అయోధ్యను పాలిస్తున్న రాజు గతించాడు. అతనికి వారసులు లేరు. అందువల్ల ప్రజలందరూ వెతికి వెతికి భగీరథుడి వద్దకు వచ్చి “మా భిక్షగా మీరీ రజ్యం స్వీకరించక తప్పదు” అని గట్టిగా పట్టుబట్టారు. అప్పటికి పరమాత్మ దర్శనం పొందివున్న భగీరథుడు ప్రజల కోరికను అంగీకరించాడు.

నాడు, అప్పటిరాజు రాజ్యాన్ని స్వీకరించమన్నపుడు ఆ ప్రలోభానికి భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందు వల్ల, భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందువల్ల, భగీరథుడికి ఇప్పుడు రాజ్యం ప్రతిబంధకంగా తోచలేదు. ఇట్టి ఉదాత్తస్థితికి చేరగల మహనీయుడు కనుకనే, భగీరథ చక్రవర్తి సమస్తలోకాల హితం కోసం గంగాదేవిని భూమికి తేగలిగాడు.

ఈనాడు ఉన్నతోన్నత పదవులకు అందుకోవాలని కృషి చేసే యువకులు భగీరథ చక్రవర్తి వంటి అంతస్సారాన్ని, పరోపకార దీక్షను నేర్చుకోవాలి. అప్పుడే వారు మెచ్చుకోదగ్గ భారత యువకులవుతారు.

 

ములాధారం: ధ్యానమాలిక – సామాజిక ఆధ్యాత్మిక సశాస్త్రీయ మాసపత్రిక

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

చిత్తశాంతికి సులువైన మార్గం

Posted on ఆగస్ట్ 20, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , |

పట్టుపురుగు తనలోని దారముతో పసిడికాయ నల్లును. తుదకదియే దానికి గోరీ యగును. అట్లే, మనుజుడును తన మనసులోని వాంఛలనెడి దృఢ పాశములతో బోను నిర్మించుకొని, అందు బంధితుడై, తప్పించుకొని దారి తెలియక బాధపడుచుండును. కాని, అందుకొక మార్గమున్నది. ఆ మార్గమును గురువు ఉపదేశించును.లేదా, నీలోనున్న దైవమే నీకు స్ఫురింపజేయవచ్చును. నీవు చేసిన ప్రతి చెడ్ద పనిని నీ దినచర్యలో వ్రాసి పెట్టూకొను మనియు, ఆ వ్రాతను పలుమారు చదువుకొనుచు నిన్ను నీవే సంస్కరించుకొనుటకు నిశ్చయించుకొనుమనియు ఉపదేశించు గురువులు కొందరుందురు. వారు నిజముగా నిన్నుద్ధరించు గురువులు. వెనుకటి తప్పులను వేమారు మనసుకు తెచ్చుకొనుటవలన, ఇకపై అట్టి తపులు చేయరాదన్న నిశ్చయమేర్పడి నిన్ను చక్కదిద్దును; దుర్భావములను, దుర్వర్తనమును దూరము చేసి సద్భావములను, సద్వర్తనమును దూరము చేసి సద్భావములను, సద్వర్తనమును నీకు సమకూర్చి పెట్టును. అది సులువైన తత్త్వ సాధన. చిత్తశాంతిని సాధించుటకు అదియే మంచి మార్గము.

మూలము: శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య వాఖ్య విభూతులు.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

లక్ష్మీకృప కలగాలంటే…….

Posted on ఆగస్ట్ 4, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |

లక్ష్మీ మాత

లక్ష్మీదేవి ఏ ఇంటిని విడిచిపెడుతుందో, ఏ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మన పురాణాది వాంగ్మయం స్పష్టంగా పేర్కొంది. మంచి అలవాట్లు, సద్గుణాలు,సౌమనస్య వాతావరణం, శుచీ శుభ్రత, సదాచారం కలిగిన ఇంట అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో ఆ ఇంట సిరి తాండవిస్తుంది.

తల్లినీ, తండ్రినీ, గురువునీ అవమానించే  చోట లక్ష్మి నిలవదు. ఏ ఇంట అతిథికి భోజనం పెట్టరో, ఆ చోట సిరి నిలవదు. అబద్ధాలాడేవారు, ఏదీ ఎవరకీ ఈయక ‘లేద’నే వారు, శీలంలేనివారు- ఉన్న ఇంట సిరి ఉండదు. పరద్రవ్యాన్ని ఆశించేవారిని, అపహరించేవారిని శ్రీ మాత విడిచి పెడుతుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారినీ, విశ్వాస ఘాతకుల్నీ, కృతఘ్నుల్నీ, ఉత్సాహంలేని వారినీ, భయపడేవారినీ ఆ తల్లి దరిచేరదు. కలహాలు జరిగేచోట, చెడుమాటలు పలికేచోట, జూదాలాడేచోట, స్త్రీని బాధించేచోట, మనోబలంలేని చోట… ఐశ్వర్యం క్రమంగా తొలగుతుంది. సంధ్యా సమయాల్లో నిద్రపోయే వారినీ, పగలు నిద్రించేవారినీ, దానం చేయనివారినీ విష్ణుపత్ని విడిచిపెడుతుంది.

శుచులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, మనోవాక్కాయాల్లో పవిత్రత కలిగినవారు, ప్రియవాదులు, స్నేహశీలురు, శౌర్యవంతులు మొదలైన సత్వగుణ సంపన్నులను సిరి తల్లి వీడదు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...