రెహమాన్ – ఓ మంచి మనిషి

Posted on నవంబర్ 11, 2014. Filed under: ఎందరో మహానుభావులు, సంగీతం | ట్యాగులు:, , , , |

A.R. Rahman : If one door closes, seven other doors open.

Simi Garewal: It happened with you

A.R. Rahman : It happens to anybody, if they believe.

నమ్రత, స్పష్టమైన ఆలోచనా ధోరణి, అకుంఠిత దైవ భక్తి వంటి ఉత్తమమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అల్లా రఖా రెహమాన్. అతని మొదటి చిత్రం రోజా నుండే నేను అతనిని అభిమానించడం మొదలుపెట్టాను. అతని సంగీతానికి మంత్ర ముగ్దున్ని అయ్యాను. చాలా గొప్ప సంగీతాన్ని అందించేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలిసినప్పుడు, రెహమాన్ కు మరింత ఆకర్షితుడయ్యాను. rahman

బ్రిటన్ రాణిని మీరు కలిసినప్పుడు, ఆవిడ మీతో ఏమన్నారు అన్న ప్రశ్నకు, రెహ్మాన్ నాకు సరిగ్గా గుర్తుకులేదు అని చెప్తున్నపుడు, అతని చిరునవ్వు ఒక చిన్న పిల్లాడిని తలిపిస్తుంది. అతను పాల్గొన్న పలు ముఖా ముఖి సమావేశాలలో ఇది చూడడానికి కుదురుతుంది. ఏమైనా తెలియనప్పుడు, అనవసర ఢాంభికాలకు పోకుండా, సూటిగా, సుత్తిమెత్తగా సమాధానాలు అందించే లక్షణం కలిగినవాడు అతను.

దుఃఖం, ద్వేషం, కోపం వంటివి ప్రక్కకు నెట్టి, ప్రేమ, కరుణ వంటి భావాలను తన జీవితంలోనూ, తన సంగీతంలోనూ నింపుతూ వచ్చాడు రెహమాన్. ఒకానొక ప్రశ్నకు సమాధానంగా, తన సంగీతం తన తోటి జనులకు శాంతిని అందించగలగాలని, గాయపడ్డ హృదయాలను నయం చేయగలగాలని చెప్పాడు. ఇంతటి మహోన్నతమైన భావాలు కలిగిన అతను, గొప్ప సంగీతకారుడు మాత్రమే కాదు, ఒక మంచి మనిషి కూడాను.

నాకు పరమత సహనం, గౌరవం వున్నను, రెహమాన్ మత మార్పిడి మాత్రం ఒక కొరకరాని కొయ్యగా మిగిలింది. సిమి గారేవాల్ తో రెహమాన్, నేను ఆ ఘట్టాన్ని మతమార్పిడిగా కాకుండా, ఒక  అధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తాను మరియు అది హఠాతుగా జరిగినది కాదు అన్న సమాధానం నాకు నచ్చింది. రెహమాన్ ను నేను ఎప్పుడన్నా తలచుకోగా, అతని సంగీతం మరియు సంగీత సంభందించిన విషయాలు మాత్రమే కాకుండా, అతని వ్యక్తిత్వం గురించి కూడా  తలుచుకుంటాను.

రెహమాన్ ఎల్లప్పుడు అతని సంగీతంతో నన్ను అలరిస్తూ, అతని వ్యక్తిత్వంతో నన్ను ప్రోత్సహిస్తూ వుండాలని కోరుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా

Posted on నవంబర్ 27, 2009. Filed under: ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే  విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా.

మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో ఉన్న వారికి కలిగే భావనలు. వాస్తవానికి దానిని నిజమైన ప్రేమ అని చెప్పలేము. అది కేవలం ప్రేమ యొక్క ఒక రూపం మాత్రమే. ప్రేమ పలు రూపాలు కలిగిన ఒక క్లిష్టమైన అనుభూతి. ఓ తల్లికి తన బిడ్డపై వున్న ప్రేమ ‘వాత్సల్యము’. భార్యా భర్తల మధ్య వుండు ప్రేమ ‘అనురాగము’, మిత్రుల మధ్య వుండే ప్రేమ ‘స్నేహము’. భగవంతుడికి భక్తునికి మధ్య వున్నదే నిజమైన ప్రేమ. అదే అన్నింటికన్నా ఉత్తమమైనది.

నిన్నటితో ముంబాయిలో తీవ్రవాదులు మారణకాండ సృష్టించి ఒక సంవత్సరకాలం అవుతున్నది. వారిలో నిజంగా సమస్త మానవాళిపై ప్రేమ గనక వుంటే, ఈ పని చేసేవారు కారు. వారి మనసులో ప్రేమ లోపిస్తుంది గనక, కరుడు కట్టి వుంటున్నది. అదే వారి మనసులో ప్రేమ గనక ఉండి వుంటే, వారు భీబత్సాన్ని సృష్టించి వుండరు.

హిందూ ధర్మము ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని దర్శించమని సూచిస్తున్నది. అలా గనక మనము చేయగలిగితే, అందరిలో వున్న భగవంతుడి ప్రేమించే అవకాశం వుంటున్నది. తద్వారా మనము సమస్త జీవకోటిని ప్రేమించే వారము అవుతాము. అప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా, ప్రేమతో అది సులువుగా పరిష్కరించబడుతుంది. ప్రతి వొక్కరిని ప్రేమించడానికి, మీరు హిందువో/ఆస్తికవాదో కానవసరం లేదు. మన జాతి మానవజాతి. మన కులం ప్రేమ కులం. ఈ విషయాలను గుర్తిస్తే చాలు. కనీసం మనము ఒకరికి మేలు చేయకున్నా, వారికి కీడు తలపెట్టకూడదు. అందరిని ప్రేమించే మనసు మనకు ఉన్నప్పుడు, దీనిని మనము చాలా సులువుగా ఆచరించవచ్చును.

కేవలం తీవ్రవాదినికే కాదు, ప్రపంచంలో నెలకొని వున్న అన్నీ నైతికమైన సమస్యలకు, మానవుని భావోద్వేగాలతో‌ ముడిపడివున్న అన్నీ సమస్యలకు, కేవలం ప్రేమ యొక్కటే పరిష్కారము. ప్రేమ ఎక్కడవుంటే అక్కడ సత్య, ధర్మ, శాంతి, అహింసలు నెలకొనివుంటాయి.

ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, మౌనంలోనే దేవుని మనము దర్శించవచ్చు. ఆ మౌనంలో మనలోని దైవత్యం మేలుకుంటుంది. అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే, తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా దొరికే పరిష్కారం అందరికి ఆమోద్య యోగ్యమే అవుతుంది. అందరిని సంతోషపెట్టేదిగా వుంటుంది.

రండి అందరూ కలిసికట్టుగా ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేద్దాం. తద్వారా శాంతియుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని సృష్టిద్దాం. ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

జీవితం చాలా అందమైనది

Posted on జూలై 31, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యాను.ఆ సమయంలో నాకు ‘జీవితం చాలా అందమైనది’ అని అన్పించింది.

అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల  సమ్మేలనం:
ప్రాణంవెలకట్టలేనిది
భాందవ్యాలుమనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….

ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.

“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా   అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.

ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ‌ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 8 వ్యాఖ్యలు )

మౌనం

Posted on జూలై 19, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , |

ఇన్నాళ్లు నేను బయటి ప్రపంచం నుంచి నేర్చుకుని పాటించిన విషయాలను మాత్రమే నా బ్లాగులో ప్రస్తావించాను. కాని, ఈ రోజు నేను మా ఇంటిలో జరిగిన ఒక సంఘటన ద్వారా, నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను.

“ఒక పాపి, మరొక పాపిని ప్రేమించగలడు. అందులో గోప్పేమిలేదు. కాని, నీకు కీడు తలపెట్టిన నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు” అని ఏసు ప్రభువు చెప్పాడు. ఇదే విషయాన్ని పలు విధములగా పలు మతాలు, మహా గ్రంథాలు శెలవిస్తున్నాయి. అసలు ప్రేమించడం అంటే ఏమిటి? తప్పు చేస్తే మన్నించడం, ఆ తప్పును సరిదిద్దడం, అర్థంచేసుకోవడం, ఆపదలో ఆదుకోవడం, కష్టాల్లో తోడు నిలవడం, ఆదరించడం, ఏదైనా మంచి/గొప్ప పని చేస్తే మెచ్చుకోవడం, సన్మార్గంలో  నడుచుకునేటట్టు చూసుకోవడం  …. ఇదే ప్రేమంటే. మన శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పుకొచ్చాము కదా!! నిజంగా మనము మన శత్రువులను ప్రేమించకపోయిన, మన ఆప్తులను సరిగ్గా ప్రేమిస్తున్నామా? అసలు మన ఇంట్లోని వారితో, మన మిత్రులతో, మన శ్రేయోభిలాషులతో ఎలా మెలగుతున్నాము? ఈ రోజు, ఒక చిన్ని సంఘటన నాకు నేనే ఈ ప్రశ్నలను సంధించుకుని, వాటి పరిష్కారం వైపు ఆలోచించే విధంగా చేసింది.

ప్రేమకు బద్ద శత్రువు అహం. ‘నేను’, ‘కేవలం నేను మాత్రమే ‘ అన్న భావనే ‘అహం’. మనము తప్పు చేసినా దానిని ఎదుటివారిపై మోపడం, కోపగించుకోవడం, అసూయ చెందడం మొదలైనవి ‘అహం’ అనే భావన వలన కలుగుతున్నది. అహం కలిగిన వ్యక్తి, మదము పట్టిన గజము వంటివాడు. ఇలా ఉన్నప్పుడు, ప్రేమించడానికి ఆస్కారం ఎక్కడ? అహాన్ని ఎలా తొలగించుకోవాలో చెప్పేంత జ్ఞానం నాకు ఇంకా అబ్బలేదని నా భావన. కాని, ఏదైనా సమస్య ఎదురైతే, అది మీ ‘భాందవ్యాలను’ దెబ్బతీసేవిధంగా ఉన్నపుడు, నా దగ్గర ఒక పరిష్కరం ఉన్నది. అ పరిష్కారం  – మౌనం.

అవును మీరు సరిగ్గానే చదివారు. నేను ఈ‌ రోజు ఒక పని చేస్తున్నపుడు ఒక తప్పు చేసాను. నా అమ్మ, అప్పుడు నా తప్పును ప్రస్తావించి, నేను ఆ విధముగా చేసివుండకూడదు అని చెప్పినప్పుడు, నాకు చెడ్డ కోపం వచ్చి, చాలా పెద్దగా మా అమ్మపైపు “‌ అంతా నీ తప్పే. నీ వళ్లే నేను ఇలా చేయవలసి వచ్చింది” అని కసిరాను. మా అమ్మను బాధపెట్టాను. ఆ తర్వాత కాసేపు, మౌనంగా కూర్చున్నాను. నాకప్పుడు నేను చేసిన తప్పు తెలిసింది. మా అమ్మను ‘క్షమాపణ’ అడిగాను. ‘ఒక తప్పును మొదటి సారి చేసినప్పుడు అది నిజంగా తప్పు కాదు. కాని, దానిని మరోమారు చేస్తేనే అది నిజముగా తప్పు‘. అందుకే మా అమ్మతో మరోమారు ఈ తప్పు చేయనని చెప్పాను.

నాకు ఇంత విజ్ఞత ఎక్కడిది? మౌనంగా నేను ఉన్న కాస్త సమయము, నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అందులో నన్ను నేను సమర్థించుకునే విధముగానే ఎక్కవగా వచ్చాయి. కాని, నా అహాన్ని పక్కకు పెట్టి, అన్నీ కోణాలలో ఆ సమస్యను నేను చూడసాగాను. ఇలా ఆలోచించడం వలనే ఆ సమస్య పరిష్కరించబడింది. ఇంకా చెప్పాలంటే, నేను భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలను చేసే ఆస్కారమే లేదు. ఒకవేళ నిజంగానే ఎదుటివారు తప్పు చేసినప్పుడు, వారికి సున్నితముగా వారి తప్పును తెలియపరచి క్షమించాలి. అప్పుడే మనము నిజముగా వారిని ప్రేమించు వారవుతాము.

మనకు కోపం వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్యలో కూరుకుపోయినప్పుడు, తొందరపడి నిర్ణయాలకు రాకుండా, కాస్త మౌనం పాటించి ఆలోచన సల్పితే, మన అంతరాత్మ మనకు తప్పక పరిష్కారాన్ని చూపుతుంది. నేను స్వయంగా ఈ రోజు దీనిని అనుభవించాను. ఇది కచ్చితముగా అందరికీ పని చేస్తుందని నా ప్రగాఢ నమ్మకం. మౌనం – నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది, మా తల్లి-కొడుకుల బంధంలో కాసింత ఎడబాటైనా రాకుండా కాపాడింది . నా దృష్టిని, నా లోకానంతా ‘ప్రేమ’మయం చేసింది. రండి, అంతా కలసి ఈ ప్రపంచాన్ని ‘ప్రేమ’మయం చేస్తాము.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

భగవంతుడు భావప్రియుడు

Posted on జూలై 13, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

కృష్ణుని దివ్య చరణములు

సత్యభామ ఒకనాడు బంగారు తట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచి “ఇవి నా తోటలో పండిన పండ్లు. ఈ జాతి మరియెక్కడను లేదు” అని వాటిని గూర్చి గొప్పగా వర్ణించింది. కృష్ణుడొక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ‘ఇవి సారహీనముల’ని చప్పరించి పడవేసెను. ఇంతలో ‘గుబ్బి’ యను ఒక గొల్లపిల్ల దోసిటిలో  కొన్ని పండ్లు తెచ్చి, “స్వామీ! ఇవి అల్లోనేరేడు పండ్లు; స్వామివలె శ్యామసుందరములు; అందువలన నాకు మిక్కిలి ప్రియములు. దయతో గైకొని అనుగ్రహింపవలెను” అనుచు పాదముల మ్రోల వ్రాలినది. కృష్ణుడు వాటి రుచిని అడుగడుగున మెచ్చుకొనుచు అన్నియు తినివేసెను. నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములే విలువ కలవి, రుచియును కలవి. అయిననేమి?! ఆమె అహంభావము, స్వాతిశయము మూలమున భగవానుని దృష్టిలో అవి రసహీనములైనవి. నేరేడు పండ్లు ఫలజాతిలో చెప్పుకోదగినవి కావు. కాకపోయిననేమి?! ఆ గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...