Archive for నవంబర్, 2009

ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా

Posted on నవంబర్ 27, 2009. Filed under: ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే  విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా.

మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో ఉన్న వారికి కలిగే భావనలు. వాస్తవానికి దానిని నిజమైన ప్రేమ అని చెప్పలేము. అది కేవలం ప్రేమ యొక్క ఒక రూపం మాత్రమే. ప్రేమ పలు రూపాలు కలిగిన ఒక క్లిష్టమైన అనుభూతి. ఓ తల్లికి తన బిడ్డపై వున్న ప్రేమ ‘వాత్సల్యము’. భార్యా భర్తల మధ్య వుండు ప్రేమ ‘అనురాగము’, మిత్రుల మధ్య వుండే ప్రేమ ‘స్నేహము’. భగవంతుడికి భక్తునికి మధ్య వున్నదే నిజమైన ప్రేమ. అదే అన్నింటికన్నా ఉత్తమమైనది.

నిన్నటితో ముంబాయిలో తీవ్రవాదులు మారణకాండ సృష్టించి ఒక సంవత్సరకాలం అవుతున్నది. వారిలో నిజంగా సమస్త మానవాళిపై ప్రేమ గనక వుంటే, ఈ పని చేసేవారు కారు. వారి మనసులో ప్రేమ లోపిస్తుంది గనక, కరుడు కట్టి వుంటున్నది. అదే వారి మనసులో ప్రేమ గనక ఉండి వుంటే, వారు భీబత్సాన్ని సృష్టించి వుండరు.

హిందూ ధర్మము ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని దర్శించమని సూచిస్తున్నది. అలా గనక మనము చేయగలిగితే, అందరిలో వున్న భగవంతుడి ప్రేమించే అవకాశం వుంటున్నది. తద్వారా మనము సమస్త జీవకోటిని ప్రేమించే వారము అవుతాము. అప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా, ప్రేమతో అది సులువుగా పరిష్కరించబడుతుంది. ప్రతి వొక్కరిని ప్రేమించడానికి, మీరు హిందువో/ఆస్తికవాదో కానవసరం లేదు. మన జాతి మానవజాతి. మన కులం ప్రేమ కులం. ఈ విషయాలను గుర్తిస్తే చాలు. కనీసం మనము ఒకరికి మేలు చేయకున్నా, వారికి కీడు తలపెట్టకూడదు. అందరిని ప్రేమించే మనసు మనకు ఉన్నప్పుడు, దీనిని మనము చాలా సులువుగా ఆచరించవచ్చును.

కేవలం తీవ్రవాదినికే కాదు, ప్రపంచంలో నెలకొని వున్న అన్నీ నైతికమైన సమస్యలకు, మానవుని భావోద్వేగాలతో‌ ముడిపడివున్న అన్నీ సమస్యలకు, కేవలం ప్రేమ యొక్కటే పరిష్కారము. ప్రేమ ఎక్కడవుంటే అక్కడ సత్య, ధర్మ, శాంతి, అహింసలు నెలకొనివుంటాయి.

ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, మౌనంలోనే దేవుని మనము దర్శించవచ్చు. ఆ మౌనంలో మనలోని దైవత్యం మేలుకుంటుంది. అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే, తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా దొరికే పరిష్కారం అందరికి ఆమోద్య యోగ్యమే అవుతుంది. అందరిని సంతోషపెట్టేదిగా వుంటుంది.

రండి అందరూ కలిసికట్టుగా ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేద్దాం. తద్వారా శాంతియుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని సృష్టిద్దాం. ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా.

Read Full Post | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

తండ్రి మనస్సు

Posted on నవంబర్ 24, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , |

మా నాన్నగారు వంశపార్యంపరంగా వస్తున్న మా చిల్లర అంగడి ( దీనినే కొన్ని చోట్ల కిరాణా కొట్టు అనో లేక శెట్టంగడి అనో లేక ఉత్తిగా కిరాణా అనో పిలుస్తుంటారు ) నిర్వహిస్తున్నారు. మా జీవనాధారం, ఊపిరి అంతా అదే. మాకు అన్నం పెట్టే దైవమది. నా ఇంజనీరింగు ఈ ఏడాదే పూర్తయ్యింది. నాకు ఉద్యోగవకాశం ఇచ్చిన సంస్థ వారు, వచ్చే నెల నన్ను ఉద్యగంలోకి తీసుకోనున్నారు. మరి ఈ కాలీ సమయాన్ని ఎలా తోసిబుచ్చాలని నేను అప్పట్లో ఆలోచించాను. కాని, ఆలోచించేలోపు సమయంతా దాదాపు గడిచిపోయింది. ఇన్ని రోజులు మా అమ్మమ్మ, నాన్నమ్మ, మేన మామ , బాబాయి ఇలా దాదాపు అందరి బంధువుల ఇళ్లకు వెళ్ళివచ్చాను. ఓ కంప్యూటరు కోర్సుకు కూడా వెళ్ళాను( కాలం వెళ్ళబుచ్చడానికే ఈ కోర్సు. ఏదో దంచేద్దామనో, చించేద్దామనో కాదు). ఈ బ్లాగును కూడా మొదలెటాను.

కార్తీక మాసంలో అంగట్లో వ్యాపారం చేయడానికి మా నాన్నకు, నా అవసరం వుంటున్నది. నేను లేకున్నా ఏదో విధంగా ఆ భగవంతుని కృపతో నెట్టుకు రాగలరు. నేను కూడా మా అంగట్లో అప్పుడప్పుడు వెళ్తూ మా నాన్నకు సాయం చేస్తుంటాను. అందులో నాకు ఏమి ఇబ్బంది కూడా లేదు. కాని, కొన్ని రోజులుగా మా నాన్న నా గురించి బాధపడుతున్నారని తెలిసింది. మా నాన్న ప్రోద్బలంతోనే నేను ఇంజనీరింగు చేశాను. మరి నేనిప్పుడు ఇంట్లోనే వున్నాను కదా, మా నాన్న పిలిచినా పిలవకున్నా అప్పుడప్పుడు మా అంగడికి వెళ్ళి పని చేస్తుంటాను. ఇంజనీరింగు చదవి, ఒక బహుళజాతి సంస్థలో త్వరలో ఉద్యోగంలో చేరునున్న తన కొడుకు ఈ విధంగా అంగట్లో పని చేస్తున్నా,పని చేయవద్దు అని కూడా అనలేకున్నాను అని మా అమ్మతో మా నాన్నగారు తన బాధను వ్యక్తపరిచారంటా.

ఈ విషయం తెలుసుకున్న మొదట్లో నాకు ఎలా ప్రవర్తించాలో  తెలియరాలేదు. మా అంగడి గిరాకిలలో(customers) కొందరితో మాకు మంచి స్నేహ బంధం ఏర్పడింది. అటువంటి గిరాకి ఐన  ఒకతని బాగా చదువుకున్న కొడుకు, తన కాలీ సమయాలలో వాళ్ల పొలంలో, పసువుల పెంపకంలో బాగా పని చేస్తాడని, ఓ మారు మా నాన్న చాలా గొప్పగా ఆ గిరాకి యొక్క కొడుకు గూర్చి చెప్పడం గుర్తు. మరి నాదగ్గర ఆ చదువుకున్న అబ్బాయి గురించి గొప్పగా పొగిడిన మా నాన్న, నా విషయం వచ్చేసరికి బాధపడడం నాకు సబుబని అనిపించలేదు. కాని ఏమి చేద్దాం, ఏ తండ్రైనా, తన పిల్లలు కష్ట పడడం సహించలేడు కదా?! అప్పుడప్పుడు కాస్త కష్టంగా తోచినా, మన పనులు మనము చేయడంలో తప్పులేదు గనక, నేను మా అంగట్లో పని చేస్తుంటాను. ఎంతైనా నేను ఈ రోజు అనుభవిస్తున్న సుఖాలకు కారణం మా అంగడే గనక, దాంట్లో పని చేయడం నాకు చాలా సంతోషమే. మన గతాన్ని మనం ఎన్నటికి మరవకూడదన్నది నేను నమ్ముతాను. మంచి మనసు కలిగిన తండ్రి నాకు వున్నందుకు ఆ భగవంతుడికి నా శత కోటి ప్రణామములు.

Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

English నుంచి తెలుగు నేర్చుకోవలసినది….

Posted on నవంబర్ 23, 2009. Filed under: తెలుగు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , |

ఇది మీరు చదువుతున్నారంటే కచ్చితంగా తెలుగువారే అయివుంటారని నేను అనుకుంటాను. తెలుగులో బ్లాగు/సైట్లను నిర్వహిస్తున్నవారు, రచనలు చేసేవారు మాతృభాష మీద అభిమానము చేతనే ఆ పని చేస్తున్నారు. కని గమనించారా? తెలుగు బ్లాగుల URLలు ఆంగ్లములో ఉన్నది. కనీసం, తెలుగులో URL అంటే ఏంటని కూడా నాకు తెలియదు. అది నా పరి(దుః)స్థితి. కాని, మనకు నచ్చిన భాషలో URLలను పొందవచ్చని ఎక్కడో ఒక బ్లాగులో చదివాను.  ప్రస్తుతం తెలుగుభాష యొక్క స్థితిని ఏవిధంగా మెరుగుపరచడం అని నేను ఆలోచన సల్పినప్పుడు, నేను తెలుసుకున్న కొన్ని వాస్తవాలు, భాషాభివృద్ధిపై నా అభిప్రాయములే ఈ టపా.

మనము ఒక్క ఆంగ్ల పదము కూడా వాడకుండా, కనీసం పది నిమిషాలైనా ప్రస్తుత కాలంలో తెలుగులో మాట్లాడలేమన్నది వాస్తవము. బహు కొద్దిమంది మాత్రమే సంపూర్ణంగా తెలుగులో మాట్లాడగలరు, అది కూడా కొంత పరిధి వరకే. నా విషయానికి వస్తే, నేను ఎవరితోనైనా బాగా మాట్లాడాలన్నా, ఎక్కడైనా సంభాషణలు సమర్పించాలన్నా, బ్లాగులలో వ్రాయాలన్నా, దాదాపు నా ఆలోచనలన్నింటిని మొదట ఆంగ్లములో రూపొందించుకొని తర్వాత తెలుగులో తర్జమా చేస్తుంటాను. అలాగని, నాకు ఆంగ్లముపై మంచి పట్టువుందని కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివిన మహత్యం – నాకు అటు పరాయి భాషైన ఆంగ్లమును, ఇటు నా మాతృభాషైన తెలుగును పూర్తిగా రాదు. తెలుగు బ్లాగులోకానికి నా శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను. నా తెలుగు ఇంత మాత్రమైనా వుందంటే అది నేను  ఈ బ్లాగులోకంలోనికి ప్రవేశించాకే. మా కాలేజీలో ఓ మారు ప్రసంగించిన ఒక పెద్దాయన ” మాతృభాష మీద పట్టు సంపాదించిన వ్యక్తికి, ఇతర భాషలు నేర్చుకోవడం బాగా సులువు” అని చెప్పారు. అది నిజమేనేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను  ప్రత్యక్షంగా చూచిన ఆంగ్లములో మంచి వక్తలైన వారు, వారి మాతృభాషలో  కూడా మంచి ప్రవీణులే.

సుమారు 200 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదో మేరకు ఆంగ్లము వాడుతున్నారు. 90 శాతం అంతర్జాతీయ వ్యవహారాలు ఆంగ్లములోనే నడుస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారం అధికశాతం ఆంగ్లములోనే ఉన్నది. ఇంటర్‌నెట్ వ్యవహారాలకు వాడుతున్న భాషలలో సింహభాగం ఆంగ్ల భాషదే. అందుకే ఆంగ్లమును గ్లోబల్ లాంగ్వేజ్ అని అంటారు.

ఈ ఆంగ్ల భాష వ్యాప్తి ప్రపంచంలో చాలా భాషలను తుడచిపెట్టేస్తోందని ఎన్నో భాషలు, సంస్కృతులు ఆగ్రహిస్తున్నాయి. ఆ ఆగ్రహం రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి కూడా. కాని, ఆంగ్లమునకు దొరుకుతున్న ఈ కొత్త ఆదరణకు  అందరి కన్నా ముందు ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువ కలవరపడుతున్నారని ప్రఖ్యాత ఇంగ్లీష్ పండితుడు డేవిడ్ క్రిస్టల్ అన్నాడు. దీని వల్ల ఇంగ్లీషే ఎక్కువ మార్పునకు లోనయిందని ఆయన వివరాలతో నిరూపించాడు. భాషకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం, స్పెల్లింగ్, లిపి, పంక్చ్యుయేషన్, గ్రామర్, పదజాలం, ఉచ్చారణ, ప్రతిదీ తీవ్ర మార్పులకు గురవుతోందని ఆయన అంటాడు. “నేనే కనుక భాషా దేవతనయ్యుంటే ఇంగ్లీష్ గ్లోబల్ భాష కావడాన్ని అనుమతించేవాణ్ణి కాను. ముఖ్యంగా దాని స్పెల్లింగ్ ప్రవర్తన వల్ల” అన్నాడాయన. మరి గ్లోబల్ లాంగ్వేజీ హోదా అనుభవిస్తున్న ఆంగ్ల భాష గురించి, ఇంగ్లీషువారే ఇంతగా ఆవేదన చెందుతుంటే.. మన భాషను ఇలాగే వదిలేస్తే చిన్నాభిన్నం అయిపోతుందని తెలిసి కూడా మనము దానిని అలాగే వదిలేద్దామా?

ప్రపంచంలో  నూటికి డెబ్భై మంది పుట్టుకతోటే కనీసం రెండు భాషలకు వారసులుగా పుడతారని భాషావేత్తలంటారు. మా చిత్తూరులో ఇది బాగా గమనించవచ్చు. చిత్తూరులో పుట్టి పెరిగిన దాదాపు అందరికి తెలుగును, తమిళమును తెలుసు. మరికొందరికైతే హింది, కన్నడం కూడా వచ్చు. ఆంగ్లము గురించి చెప్పనవసరం లేదనుకుంటా. పట్టుమని 5వ తరగతి వరకు కూడా చదువుకోని పక్కనింటి పిన్నిగారు, ఎదురింటి ఆంటీగారు కూడా సరిగ్గా రాని ఇంగలిపీషును తెలుగుతో కలిపి మాట్లాడేస్తుంటారు.

ఇంగ్లీష్ పదజాలంలో అయిదో వంతు మాత్రమే ఆంగ్లో-శాక్సన్ పదాలున్నాయి. తక్కిన నాలుగు వంతులు సుమారు 350 భాషల నుంచి తెచ్చుకున్న అరువు పదాలే. కానీ, ఇంగ్లీష్ భాషా వ్యవహారాన్ని నిర్దేశించే కీలక పదాలు మాత్రం ఆ అయిదో వంతు సాంప్రదాయక పదాలే. అంటే, ఇంగ్లీష్  మనకొక పాఠం చెప్తోంది. ఏ భాషైనా కూడా తన కీలక నిర్మాణాన్ని నష్టపోకుండానే వివిధ భాషల పదజాలాన్ని తనలో ఇముడ్చుకోగలదని, అది ఆ భాషవ్యాప్తికే దోహదం చేస్తుందనీ. ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలే తెలుగువారు కూడా చేపడుతున్నారు. నెట్‌లో పలుచోట్ల కంప్యూటరు, సాంకేతికంశాలకు సంబంధించిన పలు పదాలను ఆంగ్లములో కాకుండా తెలుగులోనే వాడే ప్రయత్నం చేస్తున్నారు. పలు వస్తువులకు, విషయములకు తెలుగులో‌ నామకరణం చేస్తున్నారు.

సుమారు నూట యాభయ్యేళ్ళ కిందట ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశించినప్పుడు మూడవ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో సాంప్రదాయక భాషలు పెద్ద కుదుపునకు లోనయ్యాయి. జనం మాట్లాడుకునే భాషను అచ్చు యంత్రం స్వీకరించకుండా అడ్డు పడడానికి సాంప్రదాయక భాషావేత్తలు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. భాషను స్థిరీకరించడం, ప్రామాణికీకరించడం నాటి ఉద్దేశం. వాళ్ళను ప్రతిఘటించిన భాషావేత్తలు వ్యతిరేకించింది అటువంటి స్థిరీకరణ ప్రయత్నాలనే. అప్పట్లో తమను ఒక కుదుపు కుదిపిన ఇంగ్లీష్ మీద వందేళ్ళ తరువాత ఇప్పుడు ఆ భాషలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఫలితంగా ఇప్పటి ఇంటర్‌నెట్ యుగంలో ఇంగ్లీష్ భాష ముక్కలు ముక్కలుగా చీలిపోయింది.

తెలుగును పునరుద్ధరించి, తెలుగు భాష వాడుకను ప్రోత్సహించే ఈ ఉద్యమంలో తెలుగును ప్రేమించేవారందరు పాలుపంచుకునే ఆవశ్యకం ఎంతైనా వున్నది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా  తెలుగు భాష/సాషిత్యం పై పట్టు సాధించే ప్రయత్నం చేయడం, మన నిత్య జీవిత విధులలో వీలైనంత వరకు తెలుగునే వాడడం, మన ఆప్తులైన వారిని కూడా తెలుగులోనే మాట్లాడించే ప్రయత్నం చేయడం ద్వారా పరోక్షంగా మన సాయం అందించిన వారమవుతాము.

తెలుగు అధికార భాషా సంఘం ఒకటుందని నాకెరుగు. ఆ సంఘం కూడా కాస్త ప్రోత్సాహం పుచ్చుకొని, ముందుకు సాగి, తెలుగు భాషాభివృద్ధికై పాటుపడువారందరికి ఓ వేదిక కలించడం మరియు తెలుగు భాషలో క్రొత్తగా చేసిన మార్పులను, నూతనంగా ప్రవేశపెట్టిన అంశాలను, పదాలను మరియు వాటి వాడుకను జన బాహుళ్యానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయటం జరగాలి.

తెలుగుకు జోహార్లు. తెలుగు తల్లికి జేజేలు.

Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

బాల్యం returns (నా మదిలో….)

Posted on నవంబర్ 16, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

నా బాల్యము గడిచిపోయినదని మొన్న నాకు మరోమారు గుర్తుకువచ్చినది. మొన్న, నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా నేను చదివిన పాఠశాలకు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకు వెళ్ళాలన్న ఉద్దేశ్యం కూడా ఉన్నది కాదు. నా మిత్రుడు విద్యా సాగర్‌కు ఎంతైనా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. అతనే నన్ను మా పాఠశాలకు తీసుకువెళ్ళాడు.

ఆ రోజు నాకు చాలా గుర్తుండిపోతుంది. నేను మా పాఠశాలలో‌ 10 సంవత్సరాల కాలం చదువుకున్నాను. ఇప్పుడు ఆ సంతోషకరమైన, నా జీవితంలో చాలా ఉపయోగకరంగా గడిపిన రోజులు గడచి సుమారు 7 సంవత్సరాలు కావస్తున్నది. అక్కడ బాలల దినోత్సవ సందర్బంగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తుంటే నా బాల్యం గుర్తుకువచ్చేసింది. మా కరస్పాండెంట్ మహేష్ రెడ్డి గారు నన్ను ఓ‌ మూలన నిల్చుని వుండగా గుర్తుంచి, ఎంతో ఆప్యాయంగా పలకరించి, నువ్వు ఇక్కడ వచ్చినది నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇంకా మా అమ్మ ఎలా ఉన్నారని కూడా అడిగి తెలుసుకున్నారు. అంత పెద్ద సంస్థకు అధిపతి, క్షణం తీరికలేకుండా ఎప్పుడు ఏదో పనిగా వుండే ఆయన, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకొని నాతో మాట్లాడిన ఆ క్షణం నాకు క్రొత్తగా రెక్కలు మొలచి గాలిలో తేలినట్టు అనిపించినది.

నా పాఠశాల రూపురేకులు ఈ గడిచిన ఏళ్లలో‌ ఎంతో‌ మారిపోయింది. కాని, నేను చదివిన కక్షల గదులు నాకు ఇంకా గుర్తుకున్నది. మేము ఆటలాడుకున్న ఆ మైదానం ఇంకా నా మదిలో పదిలంగా ఉన్నది. అక్కడి టెంకాయ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడ నేను గడిపిన ఎన్నో మధుర స్మృతులను  జ్ఞప్తికి తీసుకువచ్చాయి. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు పలువురు ఇప్పుడు ఆ పాఠశాలలో లేరు. అయినా, వారు నాకు అందించిన పాఠాలు, నేర్పిన విలువలు, నాలో బాగా పాతుకుపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు నన్ను చూసి చాలా మురిసిపోయారు. నేను ఏమి చేస్తున్నానో అడిగి తెలుసుకున్నారు. నా ఉద్యోగ జీవితం బాగుండాలని, నేను బాగా వృద్ధి చెందాలని దీవించారు. ఓ టీచరమ్మైతే  “ఓరేయ్! చిన్న చిన్న లిల్లీపుట్ల లాగా ఉండేవారు మీరు, ఇప్పుడు నేను తలపైకెత్తి చూస్తేగాని మిమ్ములను పూర్తిగా చూడలేకున్నాను” అని అన్నారు. వారు మమ్ములను కేవలం శిష్యులలాగా కాక, తమ సొంత బిడ్డలుగా చూచేవారు. వారు నన్ను వారి బిడ్డలాగా చుసుకునేవారని కృషి చేస్తే ఏంటట టపాలో ఒక ఉదాహరణతో  వివరించాను. పదవ తరగతిలో‌ వున్నప్పుడు, మా పాఠశాలను మేము ఇక వదలి వెళ్ళాలనే విషయం జ్ఞప్తికి వచ్చినప్పుడంతా నాకు మిక్కిలి బాధేసేది. నా పాఠశాలను అంతగా ప్రేమించేవడిని నేను. నా ప్రస్తుత స్థితికి, నా పాఠశాల ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా పదేళ్లు అక్కడ గడిపాను. ఎంతో నేర్చుకున్నాను. దెబ్బలు తిన్నా అది నా బాగు కోసమే అని తెలుసుకున్నాను. నా వ్యక్తిత్వం చాలా వరకు రూపుదిద్దుకున్నది అక్కడే. అది నాకు దేవాలయంతో‌ సమానం. నా పాఠశాల గురించి ఒక ముక్కలో‌ ఆంగ్లంలో‌ చెప్పాలంటే “My school is my second home”.

Read Full Post | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు

Posted on నవంబర్ 9, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |

నా గడిచిన జీవిత కాలంలో, నేను డబ్బుతో ముడిపడివున్న ఎన్నో సంఘటనలను గమనించాను. వాస్తవానికి మనకు తెలిసో తెలియకో మన జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ‌ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని.

ఈ‌ సత్యం జీర్ణించుకోవటానికి కాస్త కష్టంగానే ఉన్నా, నిత్య జీవిత ఘటనలను నిశిధంగా పరిశీలిస్తే ఇది బాగా అర్థమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము.

మనిషి కొరకు డబ్బు కావాలి, అంతే కాని డబ్బు కోసం మనిషి కాదు.
ఈ ప్రస్తుత జగత్తులో‌ డబ్బు మనిషిని శాసిస్తున్నదనే సత్యమును బాగా అర్థం చేసుకున్నప్పుడే, మనము డబ్బును శాసించగలుగుతాము. అంటే, మనము ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించగలమని కాదు. డబ్బును కాకుండా, ఆనందాన్ని మన జీవిత లక్ష్యంగా చేసుకొనుటలో కృతార్తులవుతాము.మన జీవితం మీద పూర్తి అదుపు, మన చేతులలోకి వస్తుంది.

ఈ సత్యం తెలియనంత వరకు, మన పరిస్థితి మన జీవితములో మనము దేనికోసము వెతుకుతున్నామో తెలియకుండా, నిరంతరం వెతుకుతుండదం వంటిది. మన లక్ష్యం ఏమని తెలియకపోతే మనము దానిని ఎలా పొందగలము. మీరు అనవచ్చు, ‘లేదయ్యా! నాకు జీవిత లక్ష్యం/లక్ష్యాలు లేదని ఎందుకు అనుకుంటావు?’ అని. అవి ఇల్లు కట్టడమో, సమాజంలో హోదా/పదవులు పొందడమో, సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించడమో, ఆస్తిని సంపదను కూడగట్టటమో, సమాజ సేవ కుడా కావచ్చు. మరి ఈ లక్ష్యాలను సాధించాలని మనము ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకంటే, వాటిని సాధిస్తే సంతృప్తి, సంతోషాలు కలుగుతాయని.

అంటే మనము తెలిసి/తెలియక ఏమి చేసినా, ఎన్ని చేసినా అదంతా మన  సంతోషం కోసమే. ఇది గనక మనము బాగా గుర్తుకుంచుకున్న పక్షాన వాటికి కావలసిన డబ్బును సంపాదిస్తాము. కాని, దాదాపు అందరూ ఆ డబ్బును సంపాదించే ప్రక్రియలో డబ్బుకు దాసులు అవుతున్నాము. మన అసలైన లక్ష్యమును మరచి, డబ్బే మన లక్ష్యంగా చేసుకుంటున్నాము. ఇదే మనలను తప్పుడు దారులకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నది, నేరములు చేయడానికి ప్రేరేపిస్తున్నది, అపకీర్తి పాలుచేస్తున్నది, మనలను బలహీనులను చేస్తున్నది, మన విచక్షణా జ్ఞానాన్ని హరింపజేస్తున్నది, ఆకరకు మన జీవితంలో సంతోషాన్నే లేకుండా చేస్తున్నది.

డబ్బు బాగా సంపాదించినా, ఏదో వెలితి, అసంతృప్తికి కారణము కూడా ఇదే. అందుకే ఈ‌ సత్యాన్ని బాగా అవగతం చేసుకుని, మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ‌ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము. ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.

Read Full Post | Make a Comment ( 9 వ్యాఖ్యలు )

మౌనానందం

Posted on నవంబర్ 5, 2009. Filed under: ఆధ్యాత్మికం, సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో  శ్రీ సత్య సాయి  బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను.

మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఆ పసిముఖంలో ఆనందం పెరిగి పెద్దదైనాక లోపిస్తుంది. పెరిగినకొద్దీ ప్రపంచంలో ఉన్న సొత్తంతా నా ఒక్కడిదే అనే మోహంతో కూరుకుపోతున్నారు. మీలోని కోరిక కొండంత పెరిగేసరికి మీలోని ఆనందం తగ్గుతూ అహంకారం పెరుగుతుంది. పుట్టగానే కంటిముందున్న తల్లి నా స్వంతమనుకొని అహంకరించడం మొదలు పెడతాడు. తర్వాత ఇల్లు నా సొంతమనుకుంటాడు, తర్వాత పెళ్ళాం, పిల్లలు, ప్రపంచం అంతా నాదే అనే‌ అహంకారం పెంచుకుంటూ పోతాడు. ఇవన్నీ ఇతన్ని చీత్కరించి దూరమైతే అప్పుడు అంతర్ముఖమై వాటినన్నింటిని వదిలించుకొని తనలోనే దాగొని ఉన్న అంతర్యామే తన సొంతమని గుర్తించి దానినుండి అంతటి మహత్తర ఆనందాన్ని పొందుతూ కేరింతలు కొట్టగలుగుతున్నారు. ప్రపంచం మిద మోహాలు పెంచుకోకుంటే మీరూ అట్టి ఆనందాన్నే పొందగల్గుతారు. మీ జన్మను వ్యర్థపు సంచిలా తయారు చేస్తున్నారు. పనికిరాని చెత్తంతా నింపి, అసలు పనికివచ్చేదాన్ని అడుగున పెట్టేస్తున్నారు. అందుకై మౌనంగా ఉండి మీలో నింపిన వ్యర్థపదర్థాలనన్నింటినీ బయటకు నెట్టేయండి. దీనిద్వారా మహత్తరమైన ఆత్మశక్తి మీకు అందుతూ అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అందుకే పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువలై పొంగుతూ ఉంటుంది. ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని చవిచూస్తూ మీలోని దైవాన్ని కనుగొనండి.

Read Full Post | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 2వ భాగం

Posted on నవంబర్ 4, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, లోక జ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , |

ఈ శీర్షికలోని మొదటి భాగంలో బాల్య మిత్రులను గురించి చెప్పుకొచ్చాను. బాల్యంలో కాకుండా తర్వాతి కాలంలో మనకు మిత్రులైన వారు నిజమైన స్నేహితులు కారా? అనే సందిగ్ధంతో ముగించాను.

Tell me who your friends are and I will tell you who you are” అనే సామెత ఒకటున్నది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అతని మిత్రులను బట్టి లెక్కకట్టవచ్చన్నది దీని అర్థం. అందరూ ఈ సామెతతో పూర్తిగా/పాక్షికంగా ఏకీభవించకపోవచ్చు. కాని, మన మిత్ర బృందం యొక్క ప్రభావం మాత్రం మన మీద కచ్చితంగా ఉండటం జరుగుతున్నది. మరి మన వ్యక్తిత్వం, జీవనశైలి మన మిత్రుల ఆదారంగా  ప్రభావితమవుతున్నప్పుడు, మనము స్నేహితులను ఆచితూచి జాగ్రత్తగా ఎన్నుకోవడంలో తప్పులేదని నా భావన.

మాతా పితా గురు దైవం ‘ అని అంటారు. మొదట తల్లి, తర్వాత తండ్రి, ఆ తరువాత గురువు, చిట్టచివరన దైవాన్ని ఆరాధించాలని మన పెద్దల ఉవాచ. అదే మనకు ఒక సరైన నిజమైన స్నేహితుడు గనకుంటే  అతనే మనకు లాలించే తల్లిగా, రక్షించే తండ్రిగా, దారి చూపే గురువుగా మరియు కరుణించే దైవంగా ఉంటాడు. స్నేహితుడు మనకొక అవసరం వచ్చినప్పుడు కొన్నింటికి మాత్రం ఒరిగే వ్యక్తిలా కాకుండా, మన సర్వస్వం తానై ఉంటాడు.

అమ్మానాన్నలను మనము ఎన్నుకోలేము. పుట్టుక ఆ భగవంతుని చేతిలో ఉన్నది. మన జీవితములో ఇతర వ్యక్తులకు చోటివ్వడం మాత్రం మన చేతులలో ఉన్నది. అలాగే మనలను ప్రభావితం చేసే మిత్రులను మనము చాలా జాగ్రత్తగా ఎన్నుకోవడంలో తప్పులేదు. కాని ఎన్నుకున్న తర్వాత, ఆ స్నేహ బంధాన్ని నిజాయితితో కొనసాగించాలి. మిత్రునితో ఎప్పుడూ విశ్వాసంగా ఉండాలి.

రెండేళ్ల మునపు మా కాలేజీ హాస్టలలులో రాత్రివేళల్లో  అందరూ నిద్రిస్తుండగా, నా ఆప్తమిత్రుడొకతను మరియు నేను పలు అంశములపై నాకున్న సందేహాలు మరియు అపోహలు, సామాజిక విషయాలు, సాంకేతికంశాలు ఇంకా మరెన్నో చర్చించేవాలము. స్నేహంపై నాకున్న ఒక సందేహాన్ని తీర్చుతూ “నువ్వు స్నేహం, మొదట ఏవిధంగా చేశావన్నది ముఖ్యం కాదు. కాని, ఆ తరువాత అతనితో ఎంత నిజాయితీతో ప్రవర్తిస్తున్నావన్నది ముఖ్యం” అని నాతో చెప్పిన మటలు, నాకు ఇప్పటికి గుర్తుకుంటున్నది.

ఇదివరకు ఎన్నుకోని మరి స్నేహం చేయడంలో తప్పులేదని చెప్పుకొచ్చాను. మరి మన ఎన్నిక ఏ విధంగా ఉండాలో ఈ శిర్షికలోని మూడవ టపాలో ప్రస్థావిస్తాను.

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 1వ భాగం

Read Full Post | Make a Comment ( None so far )

అంతస్సారం

Posted on నవంబర్ 3, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , |

రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది.

గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ‌ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే గంగావతారణానికి తరువాత జరిగిన  కథ ఒకటి తెలుసుకోవాలి. ఆ చక్రవర్తి రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరమాత్మను గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకొని తన ఆలోచనలన్నీ తన గురువుకు తెలిపాడు.

గురువు సలహామేరకు ఆ రాజు ఒక యజ్ఞం చేసి, తనకు గల సంపదనంతా ప్రజలందరికి దానం చేశాడు. కానీ, ఒక్క చక్రవర్తిత్వం మాత్రం మిగిలిపోయింది. దానిని కూడా తీసుకోమని భగీరథుడు చాలామందిని అడిగి చూశాడు. కానీ వారెవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆయన తన పొరుగురాజును ఆహ్వానించాడు. అసలు విషయం తెలియగానే ఆ రాజు భయపడి, “ఓ మహారాజా! మీరు ధర్మప్రభువులు మీ స్థానానికి నేను తగను” అని తప్పించుకోబోయాడు. భగీరథుడు అతనికి మంచిమాటలు చెప్పి ఎలాగోలా తన రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో మారువేషం ధరించి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరూ గుర్తుపట్టకుండా, పగటిపూట రహస్యంగా ఉండేవాడు. రాత్రిపూట మాత్రం భిక్షమెత్తుతూ, బిచ్చగాడిలా జీవిస్తూ ఉండేవాడు.

ఇలా కొంతకాలం జరిగిన తర్వాత, తన మనస్సులో అహంకారం నశించిందనే నమ్మకం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన పగటి పూటకూడా భిక్షమెత్తుకోసాగాడు. కొన్నిరోజులకు తన స్వరాజ్యమైన అయోధ్యకు చేరి, అక్కడకూడా భిక్షమెత్తసాగాడు. అయోధ్యలో ఎవరూ ఆయనను గుర్తించలేకపోయారు. అందువల్ల ఆయన సరాసరి రాజు వద్దకే వెళ్ళి భిక్షవేయమని అడిగాడు. ఇంతలో అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఒకడు పోలికలను బట్టి, కంఠస్వరం బట్టి భగీరథ మహారాజును గుర్తించి ప్రస్తుత రాజుకు చెప్పేశాడు. ఆ రాజు భగిరథునికి వినయంగా ప్రణమిల్లి “రాజ్యం  స్వీకరించండి” అని ప్రార్థించాడు. భగీరథుడు అందుకు ఇష్టపడక, “అయ్యా! పెట్టదలచుకుంటే నాకు భిక్షం పెట్టు, లేకపోతే లేదు” అని మొండికెత్తాడు. పాపం ఆ రాజు మారు మాట్లాడలేక భిక్షం పెట్టాడు. భగీరథుడు ఎంతో సంతోషంతో ఆ భిక్ష తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి అయోధ్యను పాలిస్తున్న రాజు గతించాడు. అతనికి వారసులు లేరు. అందువల్ల ప్రజలందరూ వెతికి వెతికి భగీరథుడి వద్దకు వచ్చి “మా భిక్షగా మీరీ రజ్యం స్వీకరించక తప్పదు” అని గట్టిగా పట్టుబట్టారు. అప్పటికి పరమాత్మ దర్శనం పొందివున్న భగీరథుడు ప్రజల కోరికను అంగీకరించాడు.

నాడు, అప్పటిరాజు రాజ్యాన్ని స్వీకరించమన్నపుడు ఆ ప్రలోభానికి భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందు వల్ల, భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందువల్ల, భగీరథుడికి ఇప్పుడు రాజ్యం ప్రతిబంధకంగా తోచలేదు. ఇట్టి ఉదాత్తస్థితికి చేరగల మహనీయుడు కనుకనే, భగీరథ చక్రవర్తి సమస్తలోకాల హితం కోసం గంగాదేవిని భూమికి తేగలిగాడు.

ఈనాడు ఉన్నతోన్నత పదవులకు అందుకోవాలని కృషి చేసే యువకులు భగీరథ చక్రవర్తి వంటి అంతస్సారాన్ని, పరోపకార దీక్షను నేర్చుకోవాలి. అప్పుడే వారు మెచ్చుకోదగ్గ భారత యువకులవుతారు.

 

ములాధారం: ధ్యానమాలిక – సామాజిక ఆధ్యాత్మిక సశాస్త్రీయ మాసపత్రిక

Read Full Post | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...